బిహార్‌ పీఠం ఎన్డీయేదే.. మరోసారి సీఎంగా నితీష్‌! | Bihar Assembly Election 2020 Result: Live Updates In Telugu | Sakshi
Sakshi News home page

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్‌ అప్‌డేట్స్‌

Published Tue, Nov 10 2020 7:28 AM | Last Updated on Tue, Nov 10 2020 10:36 PM

Bihar Assembly Election 2020 Result: Live Updates In Telugu - Sakshi

ఉత్కంఠభరితంగా సాగిన బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే సత్తా చాటింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలక్రిందులు చేస్తూ అవసరమైన సీట్ల కంటే ఎక్కువ దక్కించుకుంది. మెజారిటీ మార్క్‌ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. 243 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 123 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిహార్‌ పగ్గాలను మరోసారి సీఎం నితీష్‌ కుమార్‌ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ కూటమి 108 స్థానాలో విజయం సాధించింది. మరో మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతీసింది.

బిహార్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. మెజారిటీ మార్క్‌ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇక ఎన్‌డీఏ కూటమికి ఆర్జేడీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌కి కాస్త దూరంలో ఆగిపోయింది. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతీసింది. ఇక ఎల్‌జేపీ ఒక్కస్థానంలో గెలిచింది.

మళ్లీ పుంజుకున్న ఆర్జేడీ
బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రౌండ్‌ రౌండ్‌కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇంతవరకు వెనుకంజలో ఉన్న ఆర్జేడీ మళ్లీ పుంజుకుంది. ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్‌డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్‌పుర్‌ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ గెలుపొందారు.

మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోనుం‍ది. ఇక అధికార జేడీయూ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మహా కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్‌ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. 

మేమే గెలుస్తాం : ఆర్జేడీ
బిహార్‌ ఓట్ల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోంది. దర్బాంగలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బెనిపూర్‌ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి వినయ్‌ చౌదరి జయకేతనం ఎగరవేశారు. జాలే, కెవాటిలో బీజేపీ గెలుపొందగా, మోకామాలో ఆర్జేడీ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ విజయం సాధించారు. ఇక సుపాల్‌ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి బిజేంద్ర ప్రసాద్‌ గెలుపొందాడు.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌లో, ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ హసన్‌పూర్‌లో ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జీతన్‌ రాం మాంఝీ ఇమాజీ గంజ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాంకీపూర్‌లో శతృష్ను సిన్హా తనయుడు లవ్‌ సిన్హా, బిహారిగంజ్‌లో శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి వెనుకంజలో ఉంది

మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఆర్జేడీ
బిహార్‌లో ప్రభుత్వాన్ని తమే ఏర్పాటే చేస్తామని ఆర్జేడీ ధీమా వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి ముందజలో కొనసాగుతున్నప్పటికీ.. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి గెలుపు ధీమాను వ్యక్తం చేసింది. ప్రతి జిల్లా నుంచి తమకు సానుకూల స్పందన వస్తుందని, రాష్ట్రంలో కచ్చితంగా మార్పు జరుగుతుందని ఆర్జేడీ ట్వీట్‌ చేసింది. 

అతిపెద్ద పార్టీగా బీజేపీ
బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రౌండ్‌ రౌండ్‌కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇక ఎగ్జిట్‌ ఫలితాలను తారుమారు చేస్తూ బిహార్‌లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి 25స్థానాల్లో విజయం సాధించింది. మరో 101 చోట్ల ఆదిక్యంలో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి మహాఘట్‌ బంధన్‌ 15 చోట్ల విజయం సాధించగా.. 91స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇతరులు 9చోట్ల, ఎల్‌జేపీ 2చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం
ఈవీఎం ట్యాంపంరింగ్‌ జరిగిందనడం సరికాదని కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. ఫలితాలు ఎలా వచ్చినా.. ఈవీఎంలను తప్పపట్టరాదు. ఈవీఎం చాలా కచ్చితత్వమైన ఫలితాలను అందిస్తుందన్నారు. అలాగే ఈవీఎం ట్యాపంరింగ్‌ చేశారన్న ఆర్జేడీ నేతల ఆరోపణలను డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ కొట్టిపాడేశారు. ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేయడం అసాధ్యమని, గతంలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. 

తుది ఫలితం చీకటిపడ్డాకే
కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఈవీఎం మెషీన్లు వాడటంతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితం ఆలస్యం కానుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. రాత్రి పొద్దుపోయిన తర్వాతగానీ ఫలితాలన్నీ వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదని వెల్లడించింది. ఇక మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి 8 స్థానాల్లో విజయం సాధించింది. మరో 118 చోట్ల ఆదిక్యంలో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి మహాఘట్‌ బంధన్‌ 3 చోట్ల విజయం సాధించగా.. 102 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇతరులు 10 చోట్ల, ఎల్‌జేపీ 2 చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి.

కాక పెంచుతున్న ఓట్ల తేడా
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల పదుల సంఖ్యలో ఓట్ల తేడా ఉండటం ఆయా అభ్యర్థుల్లో, పార్టీల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. కాస్బా స్థానంలో ఎల్‌జేపీ 5 ఓట్ల ఆదిక్యంలో ఉండగా.. రాజ్‌గిర్‌లో జేడీయూ 26 ఓట్ల లీడింగ్‌ ఉంది. అలాగే, షేక్‌పురాలో జేడీయూ 48 ఓట్ల ఆదిక్యంలో ఉంది. నోఖా నియోజకవర్గంలో 73 ఓట్లు, ఎక్మాలో 104 ఓట్లు, బెలాగంజ్‌లో 113 ఓట్ల ఆదిక్యంలో ఆర్జేడీ అభ్యర్థులు కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు 21.4 శాతం కౌంటింగ్‌ పూర్తి
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బిహార్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 5 గంటలపాటు సాగిన కౌంటింగ్‌ ప్రక్రియలో మధ్యాహ్నం 1 గంట వరకు 87 లక్షల, 88 వేల, 780 ఓట్లు (21.4 శాతం) లెక్కించామని ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల ఓట్లున్నాయి.

170కి పైగా స్థానాల్లో స్వల్ప తేడా
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలుత కాంగ్రెస్‌-ఆర్జేడీ మహాఘట్‌ బంధన్‌ వైపు మొగ్గిన ఫలితాలు.. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి వైపునకు మళ్లాయి. 170కి పైగా స్థానాల్లో అభ్యర్థుల మధ్య తేడా 2000 వేల ఓట్ల కంటే తక్కువగా ఉందని ఎలక్షన్‌ కమిషన్‌ మధ్యాహ్నం 12 గంటలకు తెలిపింది. మొత్తం 243 స్థానాల్లో 99 చోట్ల 2000 ఓట్ల తేడా, మరో 54 చోట్ల 1000 ఓట్లలోపు వ్యత్యాసం మాత్రమే ఉందని వెల్లడించింది. 28 స్థానాల్లో 500 ఓట్ల కంటే తక్కువ తేడా ఉందని తెలిపింది. దాంతో ఓట్ల తేడా తక్కువగా ఉన్న స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధించేది అంచనా వేయడం కష్టమైపోయింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తారుమారు!
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆదిక్యం కనబరుస్తుండటంతో బీజేపీ, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు రాజధాని పట్నాలో ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తొలుత ఆదిక్యం కనబరిచిన కాంగ్రెస్‌-ఆర్జేడీ మహాఘట్‌ బంధన్‌ వెనకంజలో కొనసాగుతుండటంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనౌతున్నారు. కౌంటింగ్‌ సరళిని బట్టి ఎన్‌డీఏ కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 120 కి పైగా స్థానాల్లో ఎన్‌డీఏ, 100 కు పైగా స్థానాల్లో మహాఘట్‌ బంధన్‌ ఆదిక్యంలో కొనసాగుతున్నాయి. కాగా, బిహార్‌లో మహాఘట్‌ బంధన్‌ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్పిన విషయం తెలిసిందే.

అధిక స్థానాల్లో ఎన్‌డీఏ దూకుడు
కౌటింగ్‌ ప్రారంభమైన మొదటి రెండు గంటలు వెనుకంజలో ఉన్న ఎన్‌డీఏ కూటమి అనూహ్యంగా పుంజుకుని మెజారిటీ స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.40 గంటలకు ఎలక్షన్‌ కమిషన్‌ వివరాల ప్రకారం. ఎన్‌డీఏ కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉంది. అందులో బీజేపీ 70 స్థానాల్లో, జేడీయూ 48 స్థానాల్లో, వీఐపీ 6, హెచ్‌ఏఎం ఒక చోట ఆదిక్యంలో ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్‌లో మేజిక్‌ ఫిగర్‌ 122 సీట్లు.

ఇక గంట క్రితం వరకు ఎన్‌డీఏను వెనక్కినెట్టి ఎక్కువ స్థానంలో ఆదిక్యంలో కొనసాగిన మహాఘట్‌ బంధన్‌ క్రమక్రమంగా నెమ్మదించింది. ప్రస్తుతం 101 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. వాటిలో ఆర్జేడీ 62 స్థానాల్లో, కాంగ్రెస్‌ 20, లెఫ్ట్‌ పార్టీలు 19 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ ఒక స్థానంలో, ఎంఐఎం రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎల్‌జేపీ ఐదు స్థానాల్లో, స్వతంత్రులు 4 చోట్ల ఆదిక్యంలో ఉన్నారు.

బీజేపీ, ఆర్జేడీ పోటాపోటీ!
బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి బీజేపీ, ఆర్జేడీ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. రాష్ట్రంలోని 243 స్థానాల్లో 230 సీట్లకు సంబంధించి ఎన్నికల ఫలితాల గణాంకాలను ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం.. ఎన్‌డీఏ కూటమి 120 సీట్లలో ఆదిక్యంలో ఉండగా.. అందులో బీజేపీ 62 స్థానాల్లో, జేడీయూ 51 స్థానాల్లో లీడింగ్‌ ఉన్నాయి. వివాస్‌ షీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ 6 చోట్ల, హెచ్‌ఏఎం పార్టీ ఒక స్థానంలో ఆదిక్యంలో ఉంది.

మహా ఘట్‌బంధన్‌ 114 సీట్లలో ఆదిక్యంలో కొనసాగుతోంది. అందులో ఆర్జేడీ 62, కాంగ్రెస్‌ 24, లెఫ్ట్‌ పార్టీలు 18 చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ, ఎంఐఎం కూటమి ఒక స్థానంలో, ఎల్‌జేపీ 5 చోట్ల, స్వతంత్రులు 4 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

అనూహ్యంగా ఎన్‌డీఏ ముందంజ
కౌటింగ్‌ మొదలైనప్పటి నుంచి వెనుకంజలో ఉన్న జేడీయూ-ఎన్‌డీయే కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం 121 సీట్ల ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక తొలి నుంచి ఆదిక్యంలో కొనసాగుతున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి 112 సీట్లలో లీడింగ్‌లో ఉంది. సెక్యులర్‌ ఫ్రంట్‌ 3, ఎల్‌జేపీ 6 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.

ఆదిక్యంలో తేజస్వీ యాదవ్‌

రాఘోపూర్‌ నుంచి పోటీ చేస్తున్న మహాఘటన్‌ బంధన్‌ (ఎంజీబీ) సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ 700 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. హసన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ కూడా ఆదిక్యంలో ఉన్నారు. జాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జీవేశ్‌ కుమార్‌ 2538 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి మహాఘట్‌ బంధన్‌ వందకుపైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.

లీడింగ్‌లో ఉన్న ప్రముఖులు:
మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ, మహాఘట్‌ బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ ముఖ్య నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌, బీజేపీ సీనియర్‌ నేత ప్రేమ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నేతలు లవ్‌ సిన్హా, సుభాషిని బుందేలా ఆదిక్యంలో ఉన్నారు.

వెనుకంజలో ఉన్న ప్రముఖులు
బిహార్‌ బిజేపీ సీనియర్‌ నేత నంద కిశోర్‌ యాదవ్‌, జేడీయూ నేత జైకుమార్‌ సింగ్‌, బీజేపీ నేత శ్రేయాసి సింగ్‌, జడీయూ సీనియర్‌ నేత విజయ్‌ చౌదరి, జేఏపీ నేత పప్పు యాదవ్‌ వెనుకంజలో ఉన్నారు.

అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ!
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ-ఎన్‌డీఏ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి మహాఘట్‌ బంధన్‌ 93 సీట్లలో ఆదిక్యం కొనసాగుతుండగా.. జేడీయూ-ఎన్‌డీఏ కూటమి 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మహాఘట్‌ బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌లో ముందంజలో కొనసాగుతున్నారు. హసన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ఆదిక్యంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే బిహార్‌లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, జేడీయూ ఉండనున్నాయి. 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిహార్‌లోని మొత్తం అసెంబ్లీ సీట్లు 243. మేజిక్‌ ఫిగర్‌ 122. 

పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్‌ ఓటరు తీర్పు నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. బిహార్‌ ముఖ్యమంత్రి పీఠం యువనేత తేజస్వీ యాదవ్‌కు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్‌ కుమార్‌(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. నితీశ్‌ వయసులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయజతాదళ్‌(ఆర్జేడీ) యువ నేత తేజస్వీయాదవ్‌(31) నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి.


ఉప ఎన్నికల ఫలితాలు కూడా..
బిహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతోపాటు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి.

రఘోపూర్‌పైనే అందరి కళ్లూ
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28వ తేదీ మొదలుకొని నవంబర్‌ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్‌ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్‌పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్‌ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సమస్తిపూర్‌ జిల్లా హసన్‌పూర్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్‌ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్‌కిశోర్‌ యాదవ్‌(పట్నా సాహిబ్‌), ప్రమోద్‌ కుమార్‌(మోతిహరి), రాణా రణ్‌ధీర్‌(మధుబన్‌), సురేశ్‌ శర్మ(ముజఫర్‌పూర్‌), శ్రావణ్‌ కుమార్‌(నలందా), జైకుమార్‌ సింగ్‌(దినారా), కృష్ణనందన్‌ ప్రసాద్‌ వర్మ(జెహనాబాద్‌) ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement