2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసు అనేక సమస్యలతో ముడిపడి ఉందని.. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది.
‘బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషులను ఇతర కేసుల్లోని రెమిషన్ ప్రమాణాల ప్రకారమే విడుదల చేశారా? రెమిషన్ కోసం నిందితులు ఏళ్లుగా జైళ్లలోనే మగ్గుతుగున్న అనేక హత్య కేసులు మన ముందు ఉన్నాయి. ఈ కేసుల్లోనూ అవే నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదా?’ అని ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు.
తదుపరి విచారణ తేదీ నాటికి రెమిషన్ మంజూరుకి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో భావోద్వేగాలకు తావు లేదని, చట్ట ప్రకారం విచారిస్తామని వెల్లడించింది. ఏప్రిల్ 18న కేసును మరోసారి విచారిస్తామని తెలిపింది.
కాగా 2002 గోద్రా అల్లర్ల సమయంలోబిల్కిన్ బానోపై లైంగిక దాడి జరిగింది. ఆ సమయంలో ఆమె వయసు 21 ఏళ్ల కాగా.. అప్పటికే ఐదు నెలల గర్భవతి. అంతేగాక ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేశారు. ఇందులో మూడేళ్ల కూతురు సైతం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు విచారణను బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి.
అయితే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషి విడుదల అభ్యర్థనను పరిశీలించాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని మే 2022న కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ విధానాన్ని అమలు చేసేందుకు గుజరాత్ సర్కారుకు అనుమతినిచ్చింది. ఫలితంగా జైలులో సత్ప్రవర్తన పేరుతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది ఆగష్టు 15న నిందితులు విడుదలయ్యారు. నిందితుల్లో కొందరు 15 సంవత్సరాలు, మరికొందరు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.
ఈ క్రమంలో నిందితుల ముందస్తు విడుదలపై సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. దోషుల విడుదలపై పిటిషన్‌తో పాటు మే 13 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందులో ఒకటి సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషుల విడుదల పిటిషన్‌పై మార్చి 22న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కొత్త బెంచ్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఈ అంశాన్ని అత్యవసరంగా జాబితా చేయాలని, నిందితుల విడుదలపై విచారణ అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment