బీజేపీ అనూహ్య విజయం వెనుక కారణాలెన్నో..
సీఎంను మార్చి, కొత్త ముఖాలకు ఛాన్సిచ్చి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించిన కమలదళం
జాట్ వ్యతిరేక ఓట్లను ఏకం చేయడంలో సఫలం
హరియాణా. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై రైతుల ఉద్యమానికి వేదికగా నిలిచిన రాష్ట్రం. అగ్నివీర్ పథకంతో ఆర్మీలో శాశ్వత నియామక అవకాశాలను కోల్పోతామని యువత తీవ్ర నిరాశంలో నిండిపోయిన రాష్ట్రం. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ చూపిన దూకుడు, ఆపార్టీ అతి ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతనూ కూడా పక్కనబెట్టి మళ్లీ కమలదళానికి అధికార పగ్గాలు అప్పజెప్పిన తీరు ఎగ్జిట్‌పోల్ సర్వేలనేకాదు రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. 1966లో రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఇదే తొలిసారి.
ఏకమైన జాట్ వ్యతిరేక వర్గాలు
ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తలకిందులైన ఈ బీజేపీ విజయం వెనుక జాట్‌యేతర వర్గం ఓటర్లు ఉన్నారని అర్థమవుతోంది. ‘‘జాట్‌లు కాంగ్రెస్‌కు ఓటేశారు. అయితే బలమైన జాట్‌లను ఎదుర్కొనేందుకు జాట్‌యేతర వర్గాలైన ఓబీసీలు, దళితులు, అగ్రవర్ణాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతులయ్యారు. జాట్‌లు పూర్తిగా ఒక్క కాంగ్రెస్‌కే ఓటేయకపోవడమూ బీజేపీకి లాభించింది’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో అధ్యయనకారుడు రాహుల్ వర్మ విశ్లేషించారు.
బీజేపీ వెంటే అహిర్వాల్
దక్షిణ హరియాణాలోని అహిర్వాల్ ప్రాంత ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. 2014, 2019లో బీజేపీ విజయానికి ఈ ప్రాంత ఓటర్ల మద్దతే ప్రధాన కారణం. ఈసారి కూడా అహిర్వాల్ ఓటర్లు బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈసారీ అహిర్వాల్ ప్రాంతంలోని మెజారిటీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లోనూ 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. హరియాణా సైబర్ కేంద్రంగా కీర్తికెక్కిన గురుగ్రామ్ సైతం బీజేపీ వెంటే నిలిచింది. ఫరీదాబాద్‌సహా చాలా పట్టణ ప్రాంతాల ప్రజలు మొదట్నుంచీ బీజేపీకి వెంటే నడవటం ఆ పార్టీ విజయాన్ని సులభతరం చేసింది.
నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం
కేవలం 210 రోజుల క్రితమే సీఎంగా పగ్గాలు చేపట్టిన 54 ఏళ్ల నయాబ్ సింగ్ సైనీ తన ప్రజాకర్షక పాలనతో ఓటర్లను తన వైపునకు తిప్పుకున్నారు. గెలిస్తే ఈయననే మళ్లీ సీఎంను చేస్తానని బీజేపీ ప్రకటించడంతో ఖట్టర్ నిష్క్రమణ తర్వాత రాష్ట్రంలో పార్టీ అగ్రనేతగా అవతరించారు. హరియణా బీజేపీ మాజీ చీఫ్ అయిన సైనీ కేవలం ‘డమ్మీ సీఎం’ అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారు.
గ్రామపంచాయతీల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచడం, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో కనీసం చార్జీల రద్దు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సహా పలు అభివృద్ది పథకాలు సైనీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకాన్నిపెంచాయి. అగ్నివీర్‌లకు ఆర్మీ నుంచి బయటికొచ్చాక ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి యువతలో సైనీ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి..
దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన ఖట్టర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ముందే పసిగట్టిన బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా ఆయనను తప్పించి సైనీని సీఎంను చేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఖట్టర్‌ను పూర్తిగా పక్కనబెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా పోస్టర్లలో కూడా ఖట్టర్ ఫొటో వేయలేదు. దీంతో సీఎం, ప్రభుత్వ వ్యతిరేకత చల్లబడిందని చెప్పొచ్చు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టిన బీజేపీ
ఏకంగా సీఎం ఖట్టర్‌ను పక్కనబెట్టిన కమలం పార్టీ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టింది. ఏఏ స్థానాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో వారందరికీ టికెట్లు నిరాకరించింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతకు పోగొట్ట గలిగింది. దాదాపు 60 కొత్తముఖాలకు టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేసింది.
రైతులను బుజ్జగించే యత్నం..
వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై హరియాణా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో రైతాంగం ఆగ్రహం పోలింగ్‌లో బయటపడకుండా ఉండేందుకు ఈ ఏడాది ఆగస్టులో మరో 10 పంటలను జోడించి మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో రైతన్నలు ప్రభుత్వానికి అనుకూలంగా మారారని తెలుస్తోంది.
రూ.500కే గ్యాస్ సిలిండర్
రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కమలనేతలు హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్దానాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment