సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మళ్లీ రైతుల రక్తం చిందింది. దేశం సిగ్గుతో తలవంచుకుంటోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న ఒక రైతు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.ఈ సందర‍్భంగా రక్త మోడుతున్న రైతు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి) నేతృత్వంలోని సమావేశానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనకు దిగారు రైతులు. కర్నాల్‌లోని ఘరౌండ టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని మరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓసీ ధంకర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. ఈ లాఠీఛార్జ్ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయ పడ్డారు. దీంతో పోలీసుల దమనకాండను నిరసిస్తూ పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసు అధికారులు చెప్పారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రధాన రోడ్లు ,హైవేలను దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం నేతలు పిలుపు నిచ్చారు. అలాగే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీలతో క్రూరంగా దాడి చేసారనీ, వందలాది మంది రైతులను అరెస్టు చేశారని ఎస్‌కేఎం నేత దర‍్శన్ పాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు రోడ్లన్నీ బ్లాక్ చేయాలని బీకేయూ నాయకుడు రాకేశ్ తికాయత్ కోరారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసే వరకు రహదారుల దిగ‍్బంధనం కొనసాగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment