కుర్రాడే కదా.. అనుకుని నీళ్లలోకి లాగేసిన ఆ మొసలికి చుక్కలు చూపించాడు. పది నిమిషాలపాటు వీరోచితంగా పోరాడి మొసలి నోట్లోంచి సజీవంగా బయటపడ్డాడు.
ఒడిషా కేంద్రపడా జిల్లా నేషనల్ పార్క్ పరిధిలో భితర్‌కనికా నది ఉంది. అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు సరదాగా ఆ నది ఒడ్డుకు ఈతకు వెళ్లారు. అందులో పద్నాలుగేళ్ల ఓంప్రకాశ్ సాహోను.. ఉన్నట్లుండి ఆరడుగుల పొడవు ఉన్న ఓ మొసలి నీళ్లలోకి లాక్కెల్లింది. నడుము లోతు నీటిలోకి మునిగిపోయిన కుర్రాడు.. ప్రాణ భయంతో కేకలు వేశాడు.
వెంటనే మిగతా పిల్లలు ఒడ్డుకు చేరి సాయం కోసం స్థానికులను పిలిచారు. అయితే అప్పటికే మొసలి నోట్లో సాహో చిక్కుకుపోయాడు. ఈలోపు ఒడ్డున్న ఉన్న కొందరు మొసలిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా శక్తిని కూడదెచ్చుకుని మొసలి కళ్లలో తన వేళ్లతో పొడిచి.. దాని తలపై పిడిగుద్దులు గుద్దాడు సాహో. ఆ దెబ్బకి విలవిలలాడుతూ.. అతన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది మొసలి.
ఒడ్డుకు ఎలాగోలా చేరిన కుర్రాడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు చేతులకు గాయాలు కావడంతో కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. సాహసంతో మొసలితో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ కుర్రాడిని అంతా మెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే నెల వ్యవధిలో భితర్‌కనికా నదిలో ఒడిషాలో మొసళ్ల బారిన పడి ముగ్గరు చనిపోవడం విశేషం. నదులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అవి నెమ్మదిగా నదిని ఆనుకుని ఉన్న ఊళ్లలోకి ప్రవేశించి.. దాడులు చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment