మొసలితో మహిళ పోరు: వంటపాత్రలే ఆయుధాలు
కేంద్రపార: ప్రమాదపుటంచుల్లో ఉన్నప్పుడు గడ్డి పరకైనా వజ్రాయుధంలా కనిపిస్తుందంటారు. రోజూ తోమే వంటపాత్రలే తన ప్రాణాలను కాపాడతాయని ఆమె కూడా ఊహించలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా తనపై దాడిచేసిన మృత్యువు నుంచి ఆమె తప్పించుకున్న వైనం.. కనబరచిన ధైర్యసాహసం నిజంగా ఆశ్చర్యకరం.. వివరాల్లోకి వెళితే..
ఒడిశా బంగాళా తీరంలోని కేంద్రపార జిల్లా సింగిరి గ్రామంలో గుండా చిన్నపాటి సముద్ర పాయ వెళుతుంది. ఆ ఊరి మహిళలందరూ బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం లాంటి పనులన్నీ సముద్ర పాయ వద్దే చేస్తుంటారు. రోజూలానే సావిత్రీ సమాల్ (37) అనే మహిళ శుక్రవారం ఉదయం గిన్నెలు కడిగేందుకు అక్కడికి వెళ్లింది. తీక్షణంగా పనిచేసుకుంటూ ఉండగా పిల్లిలా వచ్చిన ఓ భారీ మొసలి ఆమెపై దాడి చేసింది. సావిత్రి కాలిని నోట కరుచుకుని నీళ్లలోకి లాక్కెల్లింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న ఆమె.. అప్పటికే తన చేతుల్లో ఉన్న గరిటె, పాత్రలతో మొసలిపై ఎదురుదాడికి దిగింది. దాని నుదిటిపై పదేపదే మోదింది. దెబ్బలకు తాళలేక మొసలి ఆమె కాలిని వదిలివేయడంతో సావిత్రి ఒక్క దూకుతో ఒడ్డుకు చేరుకుంది.
విషయం తెలసుకున్న చుట్టుపక్కలవారు సావిత్రిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆశ్చర్యకరంగా చిన్నపాటి గాయం తప్ప ప్రమాదమేమీ లేకపోవడంతో ప్రధమ చికిత్స అందించి ఆమెను ఇంటికి పంపించారు వైద్యులు. సావిత్రి సాహసాన్ని గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆమెకు నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని హామీఇచ్చారు. కాగా, సింగిరి గ్రామంలో మనుషులపై మొసలి దాడికి దిగడం ఇదే మొదటిసారని, ఇక ముందు నదీపాయ దగ్గర అప్రమత్తంగా ఉంటానని చెబుతోంది సాహస నారి సావిత్రి.