దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది.
ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్‌రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్‌నాథ్ ద్యన్ సామంతరాయ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించారు.
జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది.
మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్‌ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment