
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలోకి చొరబడాలని ప్రయత్నించిన ఐదుగురును సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) మట్టుబెట్టింది. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి దుండగులు ప్రయత్నించారు. ఇంతవరకు ఇలా ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని ఇంత సంఖ్యలో కాల్చిచంపడం ఇదే ప్రధమం.
ఇక దీని గురించి బీఎస్‌ఎఫ్ అధికారులు మాట్లాడుతూ, ‘103వ బీఎస్‌ఎఫ్ ట్రూప్ సరిహద్దులో అనుమానాస్పద కదలికలను గుర్తించింది. వారిని దేశంలోకి ప్రవేశించకుండా అక్కడే ఆగమని ఆదేశించగా వారు బీఎస్‌ఎఫ్ ట్రూప్‌పై కాల్పులు జరిపారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో 5గురు మరణించారు. దుండగులు పొడుగాటి గడ్డి మోపులను అడ్డుపెట్టుకొని దేశంలోకి ప్రవేశించాలని చూశారు. వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున 4:45 గంటల ప్రాంతంలో జరిగింది’ అని తెలిపారు. బీఎస్‌ఎఫ్ అధికారులు వారి వద్ద నుంచి ఒక ఏకే-47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.