
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ మరింత వృద్ధికి, మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచేలా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమాన్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందిన దార్శనిక బడ్జెట్‌గా అభివర్ణించారు. ‘‘భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఈ బడ్జెట్ కీలకపాత్ర పోషించనుంది. వికసిత భారత్‌కు గట్టి పునాదులు వేయనుంది’’ అని అభిప్రాయపడ్డారు.
‘‘యువత, వెనకబడ్డ వర్గాలు, మహిళలు, ముఖ్యంగా మధ్యతరగతి సంక్షేమంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఉత్పత్తి, మౌలిక తదితర కీలక రంగాల వృద్ధికి ఊపునిచ్చేలా పలు చర్యలున్నాయి. సమాజంలోని ప్రతి రంగానికీ సాధికారత కల్పించే బడ్జెట్ ఇది. యువతకైతే ఆకాశమే హద్దుగా అవకాశాలు కల్పించనున్నాం. వారికి ఇతోధికంగా ఉపాధి కల్పించడంతో పాటు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు అందించాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఆశయాలకు బడ్జెట్ సాకార రూపమిచ్చింది.
కోటిమంది యువతకు అత్యున్నత సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే సువర్ణావకాశం దక్కనుంది. ఉన్నత విద్యకు రుణసాయం అందనుంది. ఉపాధి ఆధారిత ప్రోత్సహకాల పథకం కోట్లాది ఉద్యోగాలను సృష్టించనుంది. వ్యవసాయ రంగంలో సంపూర్ణ స్వావలంబన దిశగా, మధ్యతరగతిని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో పలు చర్యలున్నాయి.
కోటిమంది రైతులను సహజ సాగుకు మళ్లించడం తదితర లక్ష్యాలతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాం. మా గత పదేళ్ల పాలనలో 25 కోట్ల మంది భారతీయులను పేదరిక కోరల నుంచి విముక్తం చేశాం. నయా మధ్యతరగతి ఆకాంక్షలకు రెక్కలు తొడిగేలా బడ్జెట్లో పలు చర్యలున్నాయి. గిరిజనులకు మరింత సాధికారత దక్కనుంది’’ అని ప్రధాని వివరించారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు..
విద్య, ఉద్యోగ కల్పన రంగాలు
⇒ పీఎం స్కీం ప్యాకేజీలు: ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల కోట్లతో 5 పథకాల అమలు.
⇒ బడ్జెట్ కేటాయింపులు: విద్య, ఉద్యోగ, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు.
⇒ తొలిసారి ఉద్యోగం చేరినవారికి ప్రోత్సాహకం: ఒక నెల వేత నం చెల్లింపు. మూడు వాయిదాల్లో కలిపి గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రయోజనం. 2.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం
⇒ ఉన్నత విద్యకు సహకారం: పైచదువుల కోసం రూ.10 లక్షల వరకు రుణం సదుపాయం.
⇒ యువతకు పెయిడ్ ఇంటర్న్‌షిప్: వచ్చే ఐదేళ్లలో 500కుపైగా కంపెనీల్లో కోటి మంది యువతకు పెయిడ్ ఇంటర్న్‌షిప్. చేరినప్పుడు రూ.6 వేలు ఆర్థిక సాయం. తర్వాత ప్రతినెలా రూ.5వేలు ఇంటర్న్‌షిప్ అలవెన్స్.
తయారీ రంగంలో ఉద్యోగాలకు ప్రోత్సాహం
⇒ తొలిసారి ఉద్యోగంలో చేరినవారికి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌ఓ చందా చెల్లింపులో ప్రోత్సాహకాలు. 30 లక్షల మంది యువతకు ప్రయోజనం.
⇒ కొత్తగా/అదనంగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రెండేళ్లపాటు ప్రోత్సాహకాలు. కంపెనీలు ప్రతి కొత్త ఉద్యోగికి సంబంధించి ఈపీఎఫ్‌ఓకు చెల్లించే యాజమాన్య వాటాలో గరిష్టంగా నెలకు రూ.3వేల వరకు రీయింబర్స్‌మెంట్. దీనితో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా.
వ్యవసాయ రంగం..
⇒ 32 అగ్రి/హార్టికల్చర్ పంటల్లో వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే 109 రకాలకు ప్రోత్సాహం
⇒ వేగంగా జాతీయ అభివృద్ధి కోసం ‘నేషనల్ కో–ఆపరేషన్ పాలసీ’ అమలు
⇒ కొత్తగా 5 రాష్ట్రాల్లో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
⇒ రొయ్యల పెంపకానికి ప్రోత్సాహం
⇒ భారీ స్థాయిలో కూరగాయల సాగుపై ప్రత్యేకంగా ఫోకస్
⇒ పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. దిగుబడి పెంపు, నిల్వ, మార్కెటింగ్‌కు ఏర్పాట్లు
⇒ దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు సేంద్రియ సాగువైపు మళ్లేలా చర్యలు. సేంద్రియ పంటలకు బ్రాండింగ్, సర్టిఫికేషన్. 10వేల బయో ఇన్‌పుట్ రీసోర్స్ సెంటర్ల ఏర్పాటు.
రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక సాయం..
బిహార్:
⇒ రూ.26 వేల కోట్లతో భారీ స్థాయిలో రహదారుల అభివృద్ధి
⇒ 2,400 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు
⇒ కొత్తగా ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్:
⇒ అమరావతి కోసం రుణ మార్గాల్లో రూ.15 వేల కోట్ల నిధులు.
⇒ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు.
ఒడిశా:
⇒ రాష్ట్రంలో పర్యాటకాన్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా సాయం.
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు..
⇒ ముద్రా రుణాల్లో తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణం తీసుకుని చెల్లించిన వారికి పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.
⇒ పరిశ్రమలు భారీ యంత్రాలు, పరికరాలను కొనుగోలు చేసుకోవడానికి రూ.100 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణాలు.
పట్టణ, గ్రామీణాభివృద్ధికి తోడ్పాటుగా..
⇒ పట్టణాల్లో వచ్చే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లతో పేద, మధ్యతరగతి వర్గాలకు కోటి ఇళ్ల నిర్మాణం.
⇒ దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.
⇒ 30 లక్షలకుపైగా జనాభా ఉన్న 14 నగరాల్లో ‘ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్’ పథకం అమలు
⇒ దేశంలోని 100 పెద్ద పట్టణాల్లో భారీ ఎత్తున నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, చెత్త తొలగింపు ప్రాజెక్టులు
⇒ గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు రూ.2.66 లక్షల కోట్లు.
మహిళా సంక్షేమం..
⇒ మహిళల కోసం ప్రత్యేకించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగం చేసేవారి కోసం వర్కింగ్ విమెన్ హాస్టళ్లు
⇒ పదేళ్ల కిందటితో పోలిస్తే మహిళా సంక్షేమం, సాధికారత కోసం 218.8 శాతం నిధులు పెంపు
⇒ మహిళలు కొనే ఆస్తులకు రిజిస్ట్రేషన్/స్టాంపు చార్జీలు తగ్గింపు
మరిన్ని ‘ప్రత్యేక’ అంశాలు..
⇒ విష్ణుపాద్, మహాబోధి ఆలయాల వద్ద టూరిజం కారిడార్లు.. టూరిజం కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం.
⇒ 3 కేన్సర్ మందుల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు.
Comments
Please login to add a commentAdd a comment