
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే రైతు నిరసనలకు సంబంధించి వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలతో పాటు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు కోవిడ్19 నిబంధనలను పాటిస్తూ శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ లేఖకు ప్రతిస్పందనగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి అధిర్ రంజన్ చౌదరికి లేఖ రాశారు. అందులో శీతాకాల సమావేశాల విషయంలో అందరు ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను నిర్వహించరాదని ఏకగ్రీవంగా అందరు నాయకులు అంగీకరించారని పేర్కొన్నారు.
జనవరిలో బడ్జెట్ సమావేశాలు..
2021 జనవరిలో బడ్జెట్ సమావేశానికి అనుకూలమని ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. త్వరలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్ చివర్లో కానీ డిసెంబర్ నెల మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.