న్యూఢిల్లీ: దేశంలో మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, వారి ఆకాంక్షను నెరవేరుస్తూ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు, పార్లమెంట్ నూతన భవనంలో ఉభయసభలు కొలువుదీరిన తొలిరోజు మంగళవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’ను దిగువ సభలో ప్రవేశపెట్టారు.
ముందు రోజే.. అంటే సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమోదముద్ర వేశారు. బిల్లుపై బుధవారం లోక్‌సభలో కీలక చర్చ జరుగనుంది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ నూతన భవనంలో లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు రికార్డుకెక్కింది. ఉభయసభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారనుంది.
మహిళా కోటా ఇప్పుడే కాదు
జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి రానుంది. అంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2027 తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. మహిళల కోటా బిల్లు చట్టంగా మారిన తర్వాత 15 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కాల వ్యవధిని పొడిగించవచ్చు.
1996 నుంచి.. గత 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభిస్తుండడం పట్ల ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు పలు విపక్షాలు సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్‌లో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందడం ఖాయమేనని చెప్పొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముమ్మాటికీ తమదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత లోక్‌సభలో 82 మంది మహిళలున్నారు. రిజర్వేషన్ల చట్టంతో ఈ సంఖ్య 181కి చేరుతుందని మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు.
ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్ నూతన భవనంలో మంగళవారం ఉభయ సభల కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదేవిధంగా, రాజ్యసభలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసగించారు. సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాలకు జీఎస్టీటీకి సంబంధించిన చెల్లింపులపై ఖర్గే లేవనెత్తిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది.
బిల్లులో ఏముంది?
► మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఆరు పేజీల బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
► లోక్‌సభలో, శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు.
► మహిళల కోటాలో మూడో వంతు సీట్లను ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తారు.
► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్‌డ్ సీట్లు రొటేషన్ అవుతుంటాయి. అంటే మహిళకు కేటాయించిన నియోజకవర్గాలు స్థిరంగా ఉండవు.
► బిల్లులో ఓబీసీ(ఇతర వెనుకబడిన తరగతులు)లను చేర్చడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉండవు.
► ఆంగ్లో–ఇండియన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉండవు.
► ప్రస్తుతం లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య కేవలం 14 శాతం ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇలా చాలా తక్కువ.
► రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లును కనీసం 50 శాతం రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment