న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించుకునే దిశగా కేంద్రం యోచిస్తుంది. జమ్మూలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బలగాలను ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు.
గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని కానీ ప్రస్తుతం వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అనేక ఆపరేషన్‌లను లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జమ్మూలో అమలులో ఉన్న AFSPAను.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70% ప్రాంతాల్లో తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక సంస్థలు, వివిధ వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా సెప్టెంబర్‌లోపు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అమిత్‌షా చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, దానిని నెరవేరుస్తారని తెలిపారు. అయితే ఈ ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని.. ప్రజల ప్రజాస్వామ్యమని అన్నారు. ఇదిలా ఉండా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాగా ఏఎఫ్‌ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment