భోపాల్:వేగానికి మారు పేరైన చిరుత పులులు త్వరలో ఇండియా అడవుల్లోకి రానున్నాయి. 74 ఏళ్ల క్రితమే మన దేశంలో అంతరించిపోయాయి చిరుత పులులు. అయితే ఇప్పుడు ఆఫ్రికా నుంచి చిరుత పులులను రప్పించి మన అడవుల్లో వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవవైవిధ్యాన్ని కాపాడే యత్నంలో భాగంగా ప్రాజెక్ట్ చీతాని చేపట్టింది.
పది చిరుతలు
దక్షిణ ఆఫ్రికా నుంచి మొత్తం పది చిరుతలను ఇండియాకు తీసుకురానున్నారు. ఇందులో ఐదు మగవి, ఐదు ఆడవి తేవాలని నిర్ణయించారు. వీటి కోసం మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయలో ఉన్న కునో నేషనల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే అక్టోబరు లేదా నవంబరులో దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు ఇక్కడికి చేరుకోనున్నాయి.
మధ్యప్రదేశ్‌లో
ఇండియా అడవుల్లో చిరుతలను ప్రవేశ పెట్టేందుకు వైల్డ్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ముమ్మరం చేయగా ... ప్రభుత్వం అంగీకరించి రూ. 14 కోట్ల నిధులు కేటాయించింది. గతంలో చిరుతలు ఎక్కువగా నివసించిన మధ్యప్రదేశ్‌లోనే వాటికి ఆవాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను పరిశీలించిన సౌతాఫ్రికా అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
చివరగా
జీవవైవిధ్యానికి నెలవైన భారత్‌లో పెద్ద పులులతో పాటు చిరుతలు పెద్ద ఎత్తున ఉండేవి. అయితే స్వాతంత్రానికి పూర్వం రాజులు, బ్రిటీషర్లు వేట పేరుతో వందల కొద్ది చిరుతలను సంహరించారు. దీంతో క్రమంగా చిరుతల సంఖ్య తగ్గిపోయింది. భారత్‌లో చిట్టచివరి చిరుతని 1947లో చత్తీస్‌గడ్‌లో చూసినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఐదేళ్లపాటు దేశంలో ఎక్కడా చిరుత జాడలు కనిపించలేదు. దీంతో దేశంలో చిరుతలు అంతరించి పోయాంటూ ప్రభుత్వం 1952లో ప్రకటించింది.
చదవండి: పద నాన్నా... దేశం చూద్దాం
Comments
Please login to add a commentAdd a comment