
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా?. శివంగిల దూకి రక్షించుకుంది.
ఛత్తీస్‌గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే..
ఇంట్లో తండ్రికి భోజనం వడ్డిస్తూ ఆ అలికిడి విన్న కొర్రం కూతురు సుశీల.. ఒక్క దూటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు గుప్పించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..
బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్‌పూర్‌లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
अपने पिता की जान बचाने के लिए एक बेटी 8 हथियार बंद नक्सलियों से भिड़ गई... बहादुर बेटी की कहानी देख लीजिए @gyanendrat1#Chhattisgarh #Narayanpur #NaxalAttack #CGNews #SeedheMuddeKiBaat #GyanendraTiwari #VistaarNews pic.twitter.com/d6PFOlsOnf
— Vistaar News (@VistaarNews) August 6, 2024
Video Credits: Vistaar News