సైకిల్‌పై వెళుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైకిల్‌పై దూసుకెళ్లారు. ముట్టుకాడు నుంచి మహాబలిపురం వరకు 20 కి.మీ దూరం సైకిల్ తొక్కుతూ, మార్గ మధ్యలో ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. సీఎం స్టాలిన్ వ్యాయామం, సైక్లింగ్, వాకింగ్ చేస్తుంటారు. ప్రతి ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేసేవారు. సీఎం అయినా ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో మార్పు లేదని చాటుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఓ ఆదివారం సైకిల్‌పై స్టాలిన్ దూసుకెళ్లారు. ఆ తర్వాత అధికారంలోకి రావడం, కరోనా కట్టడికి విస్తృతంగా సేవల్ని అందించడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కరోనా కట్టడికి వచ్చిన నేపథ్యంలో మళ్లీ సైకిల్ పయనంపై దృష్టి పెట్టారు.
మార్గ మధ్యలో సెల్ఫీలు
ఇది వరకు ఎలాంటి భద్రత లేకుండా ఒకరిద్దరితో కలిసి సైకిల్‌పై స్టాలిన్ వెళ్లేవారు. సీఎం కావడంతో భద్రతా పరంగా చర్యలు తప్పలేదు. ఎక్కడా ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేశారు. ఉదయాన్నే 15 మందితో కలిసి స్టాలిన్ ముట్టకాడు చేరుకున్నారు. అక్కడ రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణంలో తేనీరు సేవించి సైకిల్‌పై మహాబలిపురం వైపుగా 20 కి.మీ దూరం ప్రయాణించారు.
సైకిళ్లు ముందుకు సాగుతుంటే, వెనుక ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు కదిలాయి. మార్గ మధ్యలో అక్కడక్కడ ప్రజలను స్టాలిన్ పలకరించారు. సెల్ఫీలు దిగారు. మహాబలిపురం వద్దకు చేరుకుని అక్కడి ఓ హోటల్‌లో తేనీరు సేవించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment