సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పలు వ్యవస్థలను శాసిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘మీలో ఒకడిని’ పేరిట తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రచించిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకాన్ని సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రాల సమాఖ్య భారత్ అని, ఈ సమైక్యతను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు.
దేశ, రాష్ట్రాల చరిత్రలు తెలుసుకోకుండా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధాని సిద్ధపడుతున్నారని విమర్శించారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు. ‘అందరికీ అన్నీ’ అనేది ద్రవిడ సిద్ధాంతమని, ఈ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం చేసేందుకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment