సీఎం టూర్‌పై భిన్నవాదనలు
కాంగ్రెస్ పెద్దలతో ముఖ్య చర్చలు
సాక్షి బెంగళూరు: అనేక పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తినకు పయనమయ్యారు. చాలా రోజుల తర్వాత సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ టూర్‌కు వెళుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వక్ఫ్ చట్టం గొడవ, ముడా స్థలాల కేసులు, ఉప ఎన్నికలు ఇలా వరుస పరిణామాల తర్వాత సీఎం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండడం గుసగుసలకు కారణమైంది.
మంత్రి పదవులకు ఒత్తిడి
మంత్రివర్గ విస్తరణ చేయాలని ఎమ్మెల్యేలలో రోజురోజుకి డిమాండ్లు పెరుగుతున్నాయి. సీనియారిటీని చూసి మంత్రి పదవి ఇవ్వాలని డిమండ్ చేస్తున్నారు. డిసెంబర్‌లో కేబినెట్‌లో కొంతమందికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తారనే వార్తలున్నాయి. బీజేపీ, జేడీఎస్ ఆపరేషన్ కమల చేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిమండలి విస్తరణ వల్ల అసమ్మతి పుట్టి పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడితే పుట్టి మునుగుతుందనే భయం కాంగ్రెస్‌లో ఉంది. యాత్ర వెనుక మంత్రివర్గ విస్తరణ అంశం తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
సీఎం మార్పు ఉంటుందా?
సిద్ధరామయ్య వెంట డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం గమనార్హం. ముడా గొడవ, వక్ఫ్ భూముల చట్టంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సీఎం మార్పు గురించి మాట్లాడడానికే ఆయనను ఒంటరిగా పిలిచారా? అనేది కూడా తెరమీదకు వచ్చింది. అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పడానికి సీఎం వెళ్తున్నారా అనే సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. బుధ, గురువారం ఆయన పార్టీ పెద్దలను కలవనున్నారు. అలాగే నాబార్డు నిధులు, సహా పన్నుల కోతపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తానని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment