భావప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు
సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు
జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధ్ రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు మంగళవారం ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ విజయ భారతిని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో కొద్దిరోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎవరెవర్ని అరెస్టు చేశారు, మోపిన కేసుల వివరాలని్నంటినీ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అందజేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ అరెస్టులపై తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు.
కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు..
అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం బీఎన్‌ఎస్ సెక్షన్ 111 పెట్టడం ఘోరమని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులయిన 57 మందిపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసుల వేధింపుల కారణంగా 12 మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. హింసించి, భయపెట్టి వారికి అనుకూలమైన స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
శాంతియుతంగా ఉన్న తమ కార్యకర్తలు తిరగబడితే ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎక్కడకి వెళతాయో తెలియదని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు. తాము ఇప్పటివరకు డిఫెన్స్ ఆడామని, ఇక అఫెన్స్ మొదలు పెడితే తట్టుకోలేరని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయలేకే ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాధ్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు తాము అండగా ఉంటామని, వారిపై జరుగుతున్న వేధింపులను అరికడతామని ఎంపీ డాక్టర్ తనూజరాణి భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment