ముంబాయి: ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా కేసుల నమోదుతో అతలకుతలం అవుతున్న మహారాష్ట్రపై మరో పిడుగు పడింది. మహారాష్ట్ర జిల్లాలో అతి భయంకరమైన కాంగో జ్వరం వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పాల్ఘర్ పరిపాలన విభాగం మంగళవారం అధికారులను ఆదేశించింది. సాధారణంగా కాంగో జ్వరం అని పిలువబడే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), పేలు ద్వారా మానవులలో వ్యాప్తిచెందుతుంది.
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దీని గురించి మాట్లాడుతూ, ఇది పశువుల పెంపకందారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక అధికారులకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేదా మందులు, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని వారు సూచించారు. పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే ఒక సర్క్యులర్‌లో సిసిహెచ్‌ఎఫ్ గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు.
పాల్ఘర్ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా ఉంది. ఇప్పటికే వల్సాద్ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు అమలు చేయాలని అధికారులను సంబంధిత శాఖ విభాగం హెచ్చరించింది. ఈ వ్యాధి ఒక నిర్దిష్ట రకం పేల ద్వారా ఒక జంతువు నుంచి మరొక జంతువుకు వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారాగానీ, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా గానీ మానవులకు వ్యాపిస్తుందరి అందుకే జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్రలో ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారు.
సీసీహెచ్ఎఫ్ అనేది బున్యావిరిడే కుటుంబానికి చెందిన టిక్-బర్న్ వైరస్ (నైరోవైరస్) వల్ల కలిగే ఒక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ఈ వ్యాధికి గురయితే తీవ్రమైన జర్వం వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం సూదల పునర్వినియోగం, వైద్యసామాగ్రి కలుషితం కావడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
చదవండి: మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment