22న దేశవ్యాప్త నిరసన | Congress To Hold Nationwide Protest On August 22 | Sakshi
Sakshi News home page

22న దేశవ్యాప్త నిరసన

Published Wed, Aug 14 2024 5:02 AM | Last Updated on Wed, Aug 14 2024 5:51 AM

Congress To Hold Nationwide Protest On August 22

సెబీ చీఫ్‌ రాజీనామా చేయాల్సిందే 

సెబీ, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలి 

సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ 

రానున్న ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత అంశాలపై చర్చ 

ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులతో ఖర్గే భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) చైర్‌పర్సన్‌ మాధవి పురీ బుచ్, ఆమె భర్త ధవళ్‌కు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన సంచలన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వివాదంలో కేంద్ర బిందువుగా మారిన మాధవి వెంటనే రాజీనామా చేయాలని, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచి్చంది.

ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు, పీపీసీ చీఫ్‌లతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత పార్టీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సమావేశంలో రాబోయే ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత, సంస్థాగత అంశాలు, ఎన్నికలపరంగా జాతీయ ప్రాముఖ్యత గల వివిధ అంశాలు, సమస్యలపై ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించారు. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశీ్మర్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ‘‘అదానీ– మాధవి బుచ్‌ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది. 

ఒక సంస్థ ప్రయోజనాల కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ ఎంతగా ప్రలోభాలకు గురైందో ఈ ఉదంతం చాటుతోంది’’ అని నేతలు భేటీలో తీర్మానం చేశారు. భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతం సహా దేశంలోని పలు సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అందుకుతగ్గ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.

 కేరళ వయనాడ్‌ కొండల్లో ప్రకృతి విలయతాండవం ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై సమావేశం తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేసింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్‌ డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న బాధిత మైనారిటీలు గౌరవంగా బతికేలా తగు సహాయక, పునరావాస చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌చేసింది.  

పేదలు, మధ్యతరగతిని వంచించారు: ఖర్గే 
‘‘స్టాక్‌మార్కెట్లో చిన్న మదుపరుల పెట్టుబడుల భవితవ్యం అగమ్యగోచరం కాకూడదు. హిండెన్‌బర్గ్‌ బట్టబయలుచేసిన సెబీ, అదానీల ఉదంతం యావత్‌భారతావనికి షాక్‌కు గురిచేసింది. సెబీ, అదానీ సంబంధాలను బయటపెట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేతృత్వంలో దర్యాప్తు జరపాల్సిందే. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది.

కుల గణన అనేది ప్రజల డిమాండ్‌. ఈ అంశాలపై త్వరలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను చేపడదాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాల్సిందే. అగి్నపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, పగ్గాల్లేని ద్రవ్యోల్బణంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతిని ప్రభుత్వం వంచించింది. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి’’ అని ఖర్గే అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement