ఎస్.రాజమహేంద్రారెడ్డి: కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగిన ఈ యాత్ర విజయవంతమైనట్టేనా? నూటా పాతికేళ్ల పై చిలుకు సుదీర్ఘ చరిత్రలోఎన్నడూ లేనంత నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్న కాంగ్రెస్‌కు కాస్తయినా కొత్త ఊపిరులూదేనా...? వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆశించిన మేరకు ఓట్లను ‘జోడి’ంచేనా...?
కాంగ్రెస్. గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఎంతో ఘనచరిత్ర ఉన్న పార్టీ. మహా మహా నాయకులెందరినో దేశానికి అందించిన పార్టీ. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలిన జన సమ్మోహన పార్టీ. దేశాన్ని ఒక్కతాటిపై నడిపిన పార్టీ. కానీ కొన్నేళ్లుగా సొంత నేతలనే ఒక్కతాటిపై నడపలేక ఆపసోపాలు పడుతోంది. ఏదో చెయ్యాలి. మళ్లీ ఎలాగైనా పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలి. ఈ తపన, మథనం నుంచి పుట్టిన ‘భారత్ జోడో యాత్ర’ పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తుందా? లేదా లెక్క తప్పుతుందా? వేచి చూడాల్సిందే! దేశ ప్రజలను ఈ యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ ఏ మేరకు ప్రభావితం చేయగలిగారన్నది కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య ద్వారానే తేలుతుంది.
చకచకా.. చలాకీగా...
రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌కు చివరి ఆశాకిరణం. జోడో యాత్ర. రాహుల్‌గాంధీకి చివరి ఆశాకిరణం. ఈ యాత్రపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్‌గాంధీ చలాకీగా నడుస్తూ, జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది. దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ రాజకీయ ప్రస్థానం మిగతా రాజకీయ నాయకులకు విభిన్నంగా ఉంటుంది.
పట్టాభిషేకమే తరువాయి అనే యువరాజు హోదాలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనలో సహజసిద్ధమైన చొరవ, దూకుడు ఒకింత తక్కువేనని చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా చాలాకాలం పాటు అమ్మచాటు బిడ్డలానే కొనసాగడం, నాయకత్వం వహించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా వెనక్కు తగ్గడం ఆయన రాజకీయ శైలికి అద్దం పడుతుంది. ఇవాళ్టికీ కాంగ్రెస్‌కు అన్నీ ఆయనే. అయినప్పటికీ, ప్రతిపక్షాలకు మాత్రం ‘పప్పూ’గా మిగిలిపోయారు.
ప్రతిపక్షాల అక్కసు ఎలా ఉన్నా, తనేమిటో నిరూపించుకోవడాదనికి జోడో యాత్ర రాహుల్‌కు మంచి అవకాశాన్నిచ్చింది. దాన్ని ఆయన హుందాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. జనం నుంచి యాత్రకు మంచి స్పందనే వచ్చింది. చాలామంది ప్రముఖులు, మేధావులు రాహుల్‌తో కదం కలిపి సంఘీభావం తెలిపారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఓ మెట్టు పైకి లేపారు. అయితే కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఈ యాత్ర ఒక్కటే దోహదపడుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆదరణ ఓటుగా మారుతుందా అన్నది మరో చిక్కు ప్రశ్న.
వరుస ఓటములే నేపథ్యం...
ప్రస్తుతం కేవలం మూడంటే మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవడం కష్టమే! మహా అయితే లోక్‌సభలో తమ సీట్ల సంఖ్యను కొద్దో గొప్పో పెంచుకోగలదు. అంతే. నిజానికి కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అదే గొప్ప విజయంగా భావించవచ్చు. 2014 ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ ఆ తర్వాత సంస్థాగత మార్పులపై కసరత్తు చేసి 2017లో యువరాజు రాహుల్‌గాంధీని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టింది.
అప్పటిదాకా అధ్యక్షురాలిగా కొనసాగిన తల్లి సోనియాగాంధీ నుంచి పార్టీ రాజదండం అందుకున్న రాహుల్ ఊహించినంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆయనలో చొరవ, దూకుడు, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉండే కలుపుగోలుతనం లోపించాయనేది ఈ సమయంలోనే స్పష్టమైంది. పద్మవ్యూహంలాంటి రాజకీయ రణాంగణంలో మెతగ్గా, హుందాగా ఉంటే నడవదు. యుద్ధాన్ని ముందుండి నడిపించే సైన్యాధిపతిలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఊహకందని వ్యూహాలతో ముందుకురకాలి. ఆలోచిద్దాం, చేద్దాంలతో పని నడవదు.
ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలు రాహుల్‌గాంధీ పనితీరుకు అగ్నిపరీక్ష పెట్టాయి. కానీ ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా కుదేలైంది. అధ్యక్ష పదవి సోనియా నుంచి రాహుల్‌కు మారినా కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసి కొన్నాళ్లపాటు నిస్తేజంగా ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలంతా కూడా సుదీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయారు. గత మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిరంలో మేధోమథనం చేసి భారత్ జోడో యాత్రకు రూపకల్పన చేశారు.
ఆదరణ ఓటుగా మారేనా?
‘జోడో యాత్ర’ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో ఆగుతూ.. కదులుతూ... సాగుతోంది. వివాదాలకూ, వివాదాస్పద వ్యాఖ్యలకూ దూరంగా ఉంటూ, మనసులోని మాటను జనాలతో పంచుకుంటూ రాహుల్ యాత్రను కొనసాగిస్తున్నారు. సామాజిక సమస్యలు, మత సామరస్యం, ఆర్థిక అసమానతలు, రాజకీయ పెత్తందారీ పోకడల వంటి అంశాలే అజెండాగా ప్రజలతో మమేకమై చిట్టిపొట్టి విలేకరుల సమావేశాల్లో తన గళం వినిపిస్తూ వచ్చారు. ప్రధాన మీడియా చానళ్లు, పత్రికలకు సాధ్యమైనంత దూరంగా ఉన్నారు.
యాత్ర సాగుతున్న తీరు, అభిమానుల ఆత్మీయ స్పర్శ, విలేకరుల సమావేశాలను తన హాండ్లర్ ద్వారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడాన్ని యాత్ర తొలి రోజు నుంచి ఏనాడూ మిస్ కాలేదు. ప్రతిపక్షాలు రుద్దిన ‘పప్పూ’ ట్యాగ్ నుంచి బయట పడటానికి ఇది బాగా దోహదపడింది. యాత్ర మొదలైన సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఈ యూట్యూబ్ చానల్‌కు లక్షల్లో కొత్త వీక్షకులు జతగూడారు. ప్రధాని మోదీ పనితీరు, బీజేపీ అధికార దర్పం పట్ల అసంతృప్తిగా ఉన్నవాళ్లను రాహుల్ తన కొత్త వ్యవహార శైలితో ఆకర్షించగలిగారు. గత జనవరితో పోలిస్తే ఆయనకు స్వల్పంగా జనాదరణ పెరిగిందని పలు చానళ్ల సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ ఆదరణ వచ్చే జనవరికి పెరుగుతుందో, తరుగుతుందో చూడాలి.
ఈ యాత్ర కాంగ్రెస్‌లో కచ్చితంగా కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు. అయితే ఇదొక్కటే చాలదు. అటు లోక్‌సభలోనూ, ఇటు ప్రజల్లోనూ నిర్మాణాత్మక విమర్శలు, చేతలతో ప్రజల విశ్వాసం చూరగొనడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలి. సొంతింట్లోనే చిచ్చు రాజేసే క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలి. అధికారం లేనిచోట ఒక్కతాటిపై నిలిచే ప్రయత్నం చేయాలి. తాను మారిన మనిషినని ఈ పాదయాత్ర ద్వారా రాహుల్‌గాంధీ నిరూపించుకున్నట్టే యాత్ర ద్వారా చేకూరిన లబ్ధిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోగలగాలి. లేదంటే రాహుల్ భారత్ జోడో యాత్ర ఓటు జోడో యాత్రగా మారకుండా సుదీర్ఘ ‘ఈవినింగ్ వాక్’గానే మిగిలిపోతుంది!
Comments
Please login to add a commentAdd a comment