
సాక్షి బెంగళూరు: ‘ఆ సీడీ నకిలీది. నేను ఏ తప్పు చేయలేదు. నకిలీ సీడీని తయారు చేసిన వారిని జైలుకు పంపే వరకు విడిచిపెట్టేది లేదు’అని రాసలీలల వీడియోలలో దొరికిన కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి వ్యాఖ్యానించారు. తన వద్దకు ఒక పని కోసం వచ్చిన యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఈ నెల 2న వైరల్ కావడం తెలిసిందే. దీంతో మంత్రి పదవికి రమేశ్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి మంగళవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సీడీ విషయం తనకు నాలుగు నెలల క్రితమే తెలుసని, సీడీ విడుదలకు 24 గంటల ముందు బీజేపీ తనకు ఫోన్ చేసి అలర్ట్ చేసిందని చెప్పారు. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడి లేదని రమేశ్ స్పష్టంచేశారు. ఈ సీడీ కుట్ర వెనక ఇద్దరు మహిళలు, ముగ్గురు జర్నలిస్టులు, నలుగురు రాజకీయ నాయకులు ఉండవచ్చని అన్నారు. తాను మానసికంగా ఎంతో వేదన చెందానని రమేశ్ కన్నీరు పెట్టుకున్నారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారిని వదిలిపెట్టనని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని ముగించేందుకు ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాల కంటే కుటుంబమే ముఖ్యమని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment