
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల రోజుకు 60 వేల నుంచి 90 వేల వరకూ కేసులు బయట పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సంఖ్య భారీగా పడిపోయింది. గత 24 గంటల్లో 46,790 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. జూలై 28 తర్వాత 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మొత్తం కేసుల సంఖ్య 75,97,063కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 587 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,15,197కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 67,33,328కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,48,538గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 88.63 శాతానికి పెరిగింది.
డిజిటల్ హెల్త్ ఐడీ తప్పనిసరి కాదు..
వ్యాక్సినేషన్ కోసం డిజిటల్ హెల్త్ ఐడీ తప్పనిసరి కాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రకటించారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ఐడీ ఇస్తామని చెప్పారు. వ్యాక్సినేషన్ పొందాలంటే ఈ హెల్త్ ఐడీతో పనిలేదని ఆరోగ్య శాఖ ప్రకటించింది.