సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటికి చేరువైంది. 1,30,000 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టి పది నెలలు కావొస్తున్నా దాన్ని గమనాన్ని, విజృంభణను, ప్రభావాన్ని ఇప్పటికి కూడా పరిశోధకులకు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడానికి కారణాలను అన్వేషించలేక పోతున్నారు. కరోనా పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తోన్న రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని, తక్కువ నిర్వహిస్తోన్న రాష్ట్రాల్లో తక్కువ ఉందని తొలుత భావించారు. పరీక్షలు ఎక్కువ నిర్వహించిన కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువ ఉన్నాయని తేలడంతో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయేమోనని భావించారు. అందులోనూ మినహాయింపులు కనిపించడంతో పరిశోధకులకు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు.
అదే సమయంలో మరో థియరీ ముందుకు వచ్చింది. యువకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, యువతీ యువకులకు కరోనా వైరస్ వచ్చి పోయిన విషయం కూడా తెలియకపోవడంతో కేసులు తక్కువగా కనిపిస్తుండవచ్చన్నది ఆ థియేరీ. అందులోనూ లొసుగులు కనిపించడంతో ఇంకో థియరీ ముందుకు వచ్చింది. ‘ర్యాపిడ్ యాంటీజెన్’ పరీక్షలు ఎక్కువగా నిర్వహించిన రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయన్నది ఆ థియెరీ. ఈ పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో 50 శాతం ‘నెగటివ్’ ఫలితాలు రావడమే అందుకు కారణం. ఈ పరీక్షలు ఒకరికి మూడుసార్లు నిర్వహిస్తే తప్పించి సరైన ఫలితం రాదు. ఈ పరిక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయన్న వాదనలోనూ వాస్తవం లేదని తేలింది.
గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని భారత వైద్య పరిశోధనా మండలి గత మే, ఆగస్టు నెలల్లో నిర్వహించిన సర్వేల్లో తేలింది. అందులోనూ పట్టణ మురికి వాడల్లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయని తేలింది. ముంబైలోని భవన సముదాయాల్లోకన్నా జనం కిక్కిరిసి ఉండే మురికి వాడల్లో కరోనా విజృంభణ ఎక్కువగా ఉందని ‘ముంబై మున్సిపల్ కార్పొరేషన్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్’ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో బయట పడింది. యువతీ యువకుల్లో మరణాల సంఖ్య తక్కువని, వారిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దీటుగా రోగ నిరోధక శక్తి పెరగడమే కారణమని పరిశోధకులు భావించారు. కొంత మంది యువతీ యువకులు కూడా కరోనా బారిన పడడంతో ఆ వాదనలోనూ మినహాయింపులు ఉన్నాయని తేలింది. రక్తపోటు, మధుమేహం ఎక్కువగా ఉన్న వారే కరోనా బారిన పడితే మరణిస్తున్నారనడంలో కూడా నూటికి నూరుపాళ్లు నిజం లేదని, అందులోనూ మినహాయింపులు కనిపిస్తున్నాయని నిపుణలు చెబుతున్నారు.
అత్యధిక జనాభా కలిగిన పేద రాష్ట్రాలైనా ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా ఉండడానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియడం లేదని అశోక యూనివర్శిటీలో పనిచేస్తోన్న ఫిజిక్స్, బయోలోజీ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ వ్యాఖ్యానించారు. అలాగే కేరళలో కేసులు ఎక్కువ, మరణాలు తక్కువగా ఉండడానికి కూడా కారణాలు తెలియడం లేదు. ఒక్కడ పది లక్షల మందికి 55 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. పక్కనున్న తమిళనాడుతో పోలిస్తే మరణాల రేటు మూడొంతులు తక్కువగా ఉంది. నాలుగు అంచెల వైద్య విధానాన్ని అనుసరించడం, ప్రతి కరోనా కేసును గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల తమ దగ్గర మరణాల రేటు తక్కువగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, కోవిడ్‌పై సీఎంకు ప్రత్యేక సలహాదారుడు రాజీవ్ సదానందన్ తెలిపారు. స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ఇతర జబ్బులున్న వారే కరోనా కారణంగా ఎక్కువగా మృత్యువాత పడుతున్నారన్న వాదనతో వైద్య పరిశోధకులందరూ దాదాపు ఏకీభవిస్తున్నారు. (చదవండి: ‘కరోనా’ అంటే ఎందుకు భయం పోయింది?)
Comments
Please login to add a commentAdd a comment