అతి త్వరలో  శిఖర స్థాయికి కరోనా | Coronavirus second wave in India may peak by mid April | Sakshi
Sakshi News home page

11 రోజుల్లో కరోనా తీవ్ర రూపం 

Published Mon, Apr 5 2021 11:42 AM | Last Updated on Mon, Apr 5 2021 1:20 PM

Coronavirus second wave in India may peak by mid April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రెండోసారి పైకి ఎగబాకుతున్న కరోనా కేసుల సంఖ్య ఈ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఆ తర్వాత మే నెల చివరికల్లా ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని గణితశాస్త్ర నమూనాల ఆధారంగా వేసిన లెక్కలు చెబుతున్నాయి. ‘సూత్రా’అన్న సంక్షిప్త నామం కలిగిన ఈ గణితశాస్త్ర మోడల్‌.. కరోనా తొలిదశ అంకెల విషయంలోనూ కచ్చితమైన అంచనాలు వెలువరించింది. అప్పట్లో ‘సూత్రా’ ప్రకారం కరోనా కేసులు ఆగస్టులో ఎక్కువ కావడం మొదలుపెట్టి సెప్టెంబర్‌ నాటికి శిఖర స్థాయికి చేరి ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ 2021 ఫిబ్రవరికి అత్యల్ప స్థాయికి చేరుతాయని లెక్కలేసింది. అచ్చు అలాగే జరిగింది.  (కరోనా సెకండ్‌ వేవ్‌: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే ‌ మొగ్గు)

మళ్లీ నిజమయ్యేనా? 
ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలైన నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణింద్ర అగర్వాల్‌ తదితరులు ఈ సూత్రా ఆధారంగా కరోనా కేసులపై అంచనా వేశారు. దాని ప్రకారం ఏప్రిల్‌ మధ్యకల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని తేలింది. ‘ఇటీవల కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే అత్యధిక కేసులు నమోదయ్యే సమయం ఏప్రిల్‌ 15-20 తేదీల మధ్య ఉంటుందని చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నా.. తర్వాతి కాలంలో కేసులు తగ్గే వేగం కూడా అదే స్థాయిలో ఉండొచ్చు. మే నెల చివరికి కేసుల సంఖ్య అత్యల్పమవుతుంది’అని మణింద్ర అగర్వాల్‌ తెలిపారు. 

మూడు అంశాల ఆధారంగా.. 
కరోనా కేసులు పతాక స్థాయికి చేరేదెప్పుడన్న అంశాన్ని లెక్కకట్టేందుకు సూత్రా గణితశాస్త్ర మోడలింగ్‌లో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వ్యాధిబారిన పడ్డ ఒక్కో వ్యక్తి ఎంత మంది ఇతరులకు వ్యాధి సోకేలా చేయగలడన్నది ఒకటి. గుర్తించిన కేసులతో పోలిస్తే గుర్తించని కేసులెన్ని అన్నవి మిగిలిన రెండు అంశాలు. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ గుర్తించని కేసులూ ఎక్కువవుతాయి. మార్చిలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 50% వరకు పెరిగిందనిగుర్తు చేశారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉండదని సూత్రా మోడల్‌ గతేడాది వేసిన లెక్కల్లో పేర్కొంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో కొన్ని అంశాల్లో వచ్చిన మార్పులు కేసుల సంఖ్య మళ్లీ పెరిగేందుకు కారణమై ఉండొచ్చని వివరించారు. ఈ కారణంగానే తాము కొంచెం సమయం తీసుకునికొత్త అంచనాలు రూపొందించామని చెప్పారు.  

ఇకపై పంజాబ్‌ వంతు? 
ప్రస్తుతం దేశం మొత్తమ్మీద రోజువారీగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. మరికొన్ని రోజుల్లో పంజాబ్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా ఎక్కువ కావడం మొదలవుతుందని ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘అతి తక్కువ కాలంలోనే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు ఎప్పుడు చేరతాయన్నది అంచనా వేయడం కొంచెం కష్టమైన విషయమే. ఆ తర్వాత నుంచి మాత్రం కేసులు ఎక్కువ కావొచ్చు.. తక్కువయ్యేందుకూ అవకాశం ఉంది. అయితే ఇదంతా ఏప్రిల్‌ 15-20 మధ్యలోనే జరుగుతుందని భావిస్తున్నాం’అని వివరించారు. అశోక యూనివర్సిటీ శాస్త్రవేత్త గౌతమ్‌ మీనన్‌ వేసిన లెక్కల్లోనూ కేసుల సంఖ్య ఏప్రిల్‌ 15-మే 15 మధ్యకాలంలోనే పతాక స్థాయికి చేరుతుందని తేలింది.

మరోవైపు  సెకండ్‌వేవ్‌లో కరోనా మరింత విజృంభిస్తోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు రికార్డ్‌ స్థాయిలో  నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో లక్షకుపైగా కేసులు నమోదైనాయి. 1,03,558 కొత్త  కేసులు,  478 మరణాలు తాజాగా నమోదు కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement