
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు 45 వేలకు పైగా కేసులు బహిర్గతమయ్యాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య 31 వేలు దాటింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 48,916 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 757 మంది బాధితులు మృతిచెందారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 13,36,861కి, మరణాలు 31,358కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఇప్పటివరకు 8,49,431 మంది కరోనా బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు.
ప్రస్తుతం 4,56,071 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 63.54 శాతానికి చేరిందని, మరణాల రేటు 2.35 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 1,58,49,068 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలియజేసింది. ప్రతి 10 లక్షల జనాభాకు ప్రస్తుతం 11,485 కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించింది. నిత్యం 4.20 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేసింది. కరోనా పరీక్షల కోసం ఈ ఏడాది జనవరిలో కేవలం ఒక ల్యాబ్ ఉండగా, ఇప్పుడు 1,301 ల్యాబ్‌లు ఉన్నాయని గుర్తుచేసింది.