అహ్మదాబాద్‌లో బారికేడ్లు తొలగించిమరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న రోగులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్ వెనక్కి నెట్టేస్తోంది. కరోనా సంక్రమణ విషయంలో భారత్ గత కొన్ని రోజులుగా ప్రతీ 24 గంటలకు ఒకసారి రికార్డులను బద్దలుకొడుతోంది. దేశంలో రోజు రోజుకీ వైరస్ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,83,76,524కు చేరింది.
కరోనా ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లోనే 72.20% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌తో పోరాడి 3,645 మంది తుది శ్వాస విడిచారు. దీంతో మరణాల సంఖ్య 2,04,832కు పెరిగింది. కొత్తగా 2,69,507 మంది కోలుకున్నారు. వైరస్‌తో పోరాడి ఆరోగ్యవంతులైన వారి సంఖ్య మొత్తంగా 1,50,86,878కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య 30,84,814. దీంతో దేశంలో రికవరీ రేటు 82.10 శాతానికి, మరణాల రేటు 1.11% పడిపోయాయి. ఢిల్లీలో చికిత్స పొందుత్ను రోగుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది.
15 కోట్ల డోస్‌ల వ్యాక్సినేషన్
ఇప్పటివరకు దేశంలో మొత్తం 15 కోట్ల 20 వేల 648 వ్యాక్సిన్ డోస్‌లను ప్రజలకు ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడో డ్రైవ్ మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ దశలో అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం బుధవారం వరకు భారత్‌లో కరోనా వైరస్ కోసం మొత్తం 28,44,71,979 శాంపిల్స్ పరీక్షలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment