చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన ‘చంద్రయాన్-3 నౌక కీలక దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ నౌకకు ఐదో కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు చంద్రయాన్-3 ప్రయాణం సాగిస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది.
భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య కాగా, అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆపరేషన్‌ను ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పటివరకు దశలవారీగా ఐదుసార్లు పెంచారు. భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ నౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనుంది.
కాగా, జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది.
చదవండి: చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం!
ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.
అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి.
చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment