సాక్షి, బెంగళూరు(బనశంకరి): హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అనుమానాస్పద మృతికి సంబంధించి హొన్నాళి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. తుంగా కాలువలో బయటపడిన కారులో వెనుకసీట్లో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో హొన్నాళి పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.
కుందూరులో చంద్రశేఖర్ అంత్యక్రియలు
దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కుందూరు గ్రామంలోని రేణుకాచార్య తల్లిదండ్రులు సమాధుల వద్ద శుక్రవారం చంద్రశేఖర్ అంత్యక్రియలను వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో గురువారం అర్థరాత్రి శవపరీక్షలు నిర్వహించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు నివేదిక పంపించారు.
అంతిమ దర్శనం కోసం తరలివచ్చిన ప్రజలు
హొన్నాళి పట్టణంలోని రేణుకాచార్య ఇంట్లో చంద్రశేఖర్ అంతిమ దర్శనం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప, కుమారుడు కేఎస్.కాంతేశ్, పార్టీ నేతలు కార్యకర్తలు అంతిమ దర్శనం చేసుకున్నారు.
చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే)
స్పీడోమీటర్‌లో 100 కిలోమీటర్ల వేగం నమోదు
చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైన ఘటన స్థలాన్ని శుక్రవారం ఏడీజీపీ అలోక్ కుమార్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అక్టోబరు 30 తేదీ రాత్రి 11.58 నిమిషాలకు న్యామతి వద్ద చంద్రశేఖర్ కారు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు రికార్డయింది. అదేరోజు రాత్రి 12.06 నిమిషాలకు చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. మృతదేహం లభించిన స్థలానికి న్యామతికి 10 కిలోమీటర్లు దూరం ఉంది. కాల్ హిస్టరీ, సీడీఆర్‌తో పాటు అన్నింటిని తనికీ చేసి వీటితో డయాటైమ్ టెస్ట్‌సైతం చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చిన తరువాత విషయాలు వెల్లడవుతాయన్నారు. దావణగెరె ఎస్‌పీ రిష్యంత్ నేతృత్వంలో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు.
మాజీ సీఎం యడియూరప్ప నివాళి
హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య నివాసానికి శుక్రవారం మాజీ సీఎం యడియూరప్ప వచ్చి చంద్రశేఖర్ పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. చంద్రశేఖర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని రేణుకాచార్య చెప్పినట్లు నిజమైంది. సీఎం బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చొరవతో దర్యాప్తు వేగంగా సాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment