
దిస్పూర్: అసోంలోని ఒక గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సమాజం ఎంతో ముందుకు వెళ్తూ విజ్ఞానం పెరిగినప్పటికీ ఇంకా మూడ నమ్మకాల భ్రమలో నుంచి చాలా మంది బయటపడలేక పోతున్నారు. మంత్రగత్తె అన్న అనుమానంతో ఒక వృద్ధ మహిళను గ్రామస్తులు తల నరికి చంపారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన 28 ఏళ్ల టీచర్‌ను కూడా గ్రామస్తులు విచక్షణారహితంగా తల నరికి ప్రాణం తీసేశారు.
డోక్మోకా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంగ్హిన్ రహీమాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో రామావతి హలువా అనే మహిళ క్షుద్రపూజలు చేస్తుందనే నెపంతో గ్రామస్తులు ఆమెపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలు బిజోయ్ గౌర్ ప్రయత్నించి, మూఢనమ్మకాల కారణంగా ఇలాంటి పనులు చేయవద్దు అని నిలువరించే ప్రయత్నం చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న గ్రామస్తులు ఆమెపై దాడి చేసి తల నరికేశారు. తరువాత వారి మృతదేహాలను కొండ ప్రాంతాలకు తీసుకువెళ్లి దహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని జిల్లా ఎస్పీ తెలిపారు. వారందరూ ఆర్ధికంగా వెనుకబడిన వారని, వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. చదవండి: జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ
Comments
Please login to add a commentAdd a comment