
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్.కె.పురంలో ఒకతను 10 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించమంటే తప్పించుకుని తిరుగుతున్న కారణంగా తుపాకీలతో దాడి చేసిన ముగ్గురు దుండగులు. ఈ కాల్పుల్లో అప్పు తీసుకున్న వ్యక్తి ఇద్దరు సోదరీమణులు మృతి చెందారు.
నైరుతి ఢిల్లీలోని ఆర్.కె.పురం అంబేద్కర్ బస్తీలో నివాసముంటున్న లలిత్ కొన్నాళ్ల క్రితం 10 వేలు అప్పు చేశాడు. తీరా అప్పును తిరిగి చెల్లించమంటే తప్పించుకుంటున్నాడని 15 నుండి 20 మంది దుండగులు పథకం ప్రకారం లలిత్ ఇంటి పరిసరాల్లో ఉదయం 4 గంటలకు మాటేశారు. మొదట ఒకతను తలుపు తట్టగా ఎవ్వరూ తలుపు తీయలేదు.
దీంతో కొద్దిసేపటికి డోర్ మీదకు ఇటుకలు విసరడం మొదలుపెట్టారు. ఆ తలుపు చప్పుళ్లకు ఇంట్లో నుంచి లలిత్ తోపాటు అతని సోదరీమణులు పింకీ(30), జ్యోతి(29) కూడా బయటకు వచ్చారు. రాళ్లు ఎందుకు విసురుతున్నారని దుండగలతో వాగ్వాదానికి దిగారు. మాట్లాడుతున్నంతలోనే వారిలో నుంచి ఒకతను తుపాకి తీసి కాల్పులు జరిపాడు.
పింకీ, జ్యోతి ఇద్దరిలో ఒకరికి ఛాతీలోకి మరొకరికి కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోగా అక్కచెల్లెలిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. లలిత్ మాత్రం ఎలాగోలా అక్కడినుండి తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారమందించారు. హుటాహుటిన తెల్లవారు జామున 4.40 ప్రాంతంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ సౌత్ వెస్ట్ డెప్యూటీ కమిషనర్ మనోజ్.సి తెలిపిన వివరాల ప్రకారం పింకీ, జ్యోతిలను స్థానిక ఎస్.జె హాస్పిటల్ కు తరలించగా అప్పటికే వారు మృతి చెందారని, డబ్బు వివాదమే కాల్పులకు కారణమని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: 30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్.. తాజాగా తాగి వాగేసి.. దొరికేశాడు