న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆప్ నేత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కాగా లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.
2021-22 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని ఆరోపించిన సీబీఐ.. ఎనిమిది గంటలపాటు సిసోడియాను విచారించిన అంనంతరం ఫిబ్రవరి 26న ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆప్ సీనియర్ నేత విచారణకు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదంటూ అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతడి పేరును నిందితుల జాబితాలో చేర్చారు.
అంతకుముందు సిసోడియా తన బెయిల్ పిటిషన్‌లో సీబీఐ విచారణకు హాజరువుతున్నానని, భవిష్యత్తులో కూడా సహకరిస్తానని తెలిపారు. ఈ కేసులోని మరో నిందితుడికి ఇప్పటికే బెయిల్ మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. అంతేగాక ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీలు జరిగాయని, ఈ క్రమంలో ఇంకా తాను కస్టడీలో ఉండటానికి ఎలాంటి ప్రయోజనకర ఉద్దేశ్యం లేదని తెలిపారు.
చదవండి: ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు: హైకోర్టు
అయితే ఆప్ నేత బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. సీబీఐ తరపున డీపీ సింగ్ వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తును దెబ్బతీస్తుందని, సిసోడియా సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు, సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. తాము సెక్షన్ 41A CrPC నోటీసులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని తాము ఆ దశను దాటేశామని పేర్కొన్నారు. కస్టడీని కంటిన్యూ చేయడానికి సీబీఐ బలవంతమైన కారణం ఏం పేర్కొనలేదని.. సిసోడియా సాక్షులను బెదిరించగలరని రికార్డుల్లో ఎక్కడ లేదని కోర్టుకు విన్నపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు ఈనెల 24వ తేదీన సిసిడియా బెయిల్ అభ్యర్థనపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment