
ఆర్టీ- పీసీఆర్ పరీక్ష ఫలితాల ఆధారంగానే పాజిటివిటీ రేటును అంచనా
ముంబై: రాష్ట్రంలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. థర్డ్‌వేవ్ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించి, సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. అదే విధంగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతామని పేర్కొంది.
ఇక తాజా మార్గదర్శకాల ప్రకారం పుణె, థానేల్లో పాలనా విభాగాల్లో లెవల్ 3 నిబంధనలు అమల్లో ఉంటాయని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా సర్కారు స్పష్టం చేసింది. మాల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరిచేందుకు అనుమతి ఉంటుందని, అయితే.. సాయంత్రం 4 గంటల వరకే ఈ వెసలుబాటు ఉంటుందని వెల్లడించింది. ఆర్టీ- పీసీఆర్ పరీక్ష ఫలితాల ఆధారంగానే పాజిటివిటీ రేటును అంచనా వేస్తామని, రాపిడ్ యాంటీజెన్ టెస్టులతో పనిలేదని పేర్కొంది. ఈ సందర్భంగా.. డెల్టా ప్లస్ వేరియంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకరమైన వేరియంట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలో మూడో స్థాయి నిబంధనలు అమల్లో ఉంటాయని, రాష్ట్రంలోని అర్హులైన 70 శాతం మందికి టీకా వేయించడం తమ లక్ష్యమని తెలిపింది. కాగా రత్నగిరి, జలగాం సహా ఇతర జిల్లాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో డెల్టా ప్లస్ వేరియంట్ తో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.