
లండన్/వాషింగ్టన్: భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం లండన్‌లో సమావేశమయ్యారు. భారత్‌లో కోవిడ్ పరిస్థితితోపాటు వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంతం, వివిధ అంతర్జాతీయ వేదికలపై సహకారం వంటి అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ కోవిడ్‌పై పోరులో అందిస్తున్న సహకారానికి బ్లింకెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌పై పోరులో భారత్‌కు సాధ్యమైనంత మేర సాయం అందిస్తామని బ్లింకెన్ తెలిపినట్లు జైశంకర్ వెల్లడించారు.
రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడంపైనా వారు చర్చించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. వైద్యసామగ్రి, ఔషధాలతో మరో దఫా సాయం భారత్‌కు త్వరలోనే అందనుందని అమెరికా విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. భద్రతామండలి, వాతావరణ మార్పులు, మయన్మార్‌లో పరిణామాలపైనా బ్లింకెన్‌తో చర్చించినట్లు అనంతరం జై శంకర్ ట్విట్టర్‌లో తెలిపారు. జీ7 విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొనేందుకు జై శంకర్ లండన్ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment