బెంగళూరు: విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, దానికి ప్రయాణికుడు చెప్పిన ‘సారీ’తో సరిపెట్టుకున్న ఇండిగో సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. వ్యవహారంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో ఉంది బీజేపీ యువ ఎంపీ కావడం వల్లే ఇలా.. ఎలాంటి చర్యలు లేకుండా వ్యవహారం చల్లారిపోయిందని రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 10వ తేదీన ఇండిగో విమానం నెంబర్ 6ఈ 733లో చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు బోర్డింగ్ జరుగుతున్న టైంలో ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచాడు. ఆ ఘటనకు సంబంధించి క్షమాపణలు చెప్పడంతో.. అక్కడికక్కడే ఆ విషయాన్ని వదిలేసింది ఇండిగో. ఘటన జరిగిన రెండు గంటలకుపైగానే ఆలస్యంగా నడిచింది విమానం. ఇండిగో ప్రకటన ద్వారా.. ఈ విషయం తాజాగా(మంగళవారం) వెలుగులోకి వచ్చింది.
అయితే ఆ ప్రయాణికుడు కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంటూ గత రాత్రి నుంచి మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని.. కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అతని(తేజస్వి సూర్య) ప్రవర్తన ఎప్పుడూ అలాగే చిన్నపిల్లలాగా, చిల్లరగా ఉంటుందని పేర్కొంది. అలా అత్యవసర ద్వారం తెరవడం శిక్షార్హమైన నేరం. విమానయాన అధికారులు ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదంటూ వరుసగా ట్వీట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
గతంలో జనాలను నిరక్షరాస్యులంటూ నిర్లక్ష్యపూరిత కామెంట్లు చేసిన ఇదే తేజస్వి సూర్య.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడంటూ నిలదీస్తోంది కాంగ్రెస్. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏం బదులు ఇచ్చేవాడంటూ మండిపడుతోంది. పిల్లలకు బాధ్యతలు ఇస్తే ఇలాగే ఉంటుందంటూ ఎద్దేశా చేసింది కాంగ్రెస్. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సైతం ఈ వ్యవహారంపై మండిపడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇంకోవైపు శివ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని ట్విటర్ ద్వారా కోరుతున్నారు.
చెన్నై ఎయిర్‌పోర్ట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరోజు విమానంలో తేజస్వి సూర్య ఉన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కూడా ఉన్నారు. ఇంకోవైపు విమర్శలు మొదలై.. 24 గంటలు గడుస్తున్న సదరు యువ ఎంపీ స్పందించకపోవడం గమనార్హం. బెంగళూరు సౌత్‌లోని ఎంపీ కార్యాలయం కూడా మీడియా ప్రశ్నకు బదులు ఇవ్వడం లేదు. మరోవైపు కర్ణాటక బీజేపీ సైతం ఈ విమర్శలను తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.!
Comments
Please login to add a commentAdd a comment