సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లి తీహార్ జైలులో ఉన్న కవితలో ములాఖత్ అయ్యారు.
మరోవైపు.. ఇటీవలే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్.. కవితను కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుతున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. కవిత గత 80 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.
అనంతరం, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్‌సింగ్, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని జూన్ మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment