
న్యూఢిల్లీ: తమ యూజర్ల సేఫ్టీ, డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ, ఇంటర్నెట్ విధానపర నిర్ణయాలను భారత్‌లో అమలుచేసే పబ్లిక్ పాలసీ విభాగం డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ అగర్వాల్‌ను నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా సోమవారం ప్రకటించింది. గత పబ్లిక్ పాలసీ మహిళా డైరెక్టర్ అంఖి దాస్ స్థానంలో ఈయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఫేస్‌బుక్‌లో ముస్లిం వ్యతిరేక పోస్ట్‌ల వ్యవహారంలో బీజేపీ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆమెపై అంఖి దాస్ విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో గత ఏడాది అక్టోబర్‌లో ఆమె పదవి నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజీవ్‌ను కొత్త డైరెక్టర్‌గా ఫేస్‌బుక్ నియమించింది. ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ పర్యవేక్షణలో రాజీవ్ పనిచేస్తారు. ఐఏఎస్ అధికారిగా 26 ఏళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో పనిచేసిన రాజీవ్ గతంలో యూపీలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే తొలిసారిగా మేథో హక్కులకు సంబంధించిన నేషనల్ పాలసీలో విధానపర నిర్ణయాల రూపకల్పనలో కీలకంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన పారిశ్రామిక ప్రోత్సహకాలు, అంతర్గత వాణిజ్య విభాగంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.