
నెహ్రూను పొగిడిన కలెక్టర్ కు ఝలక్..!
భోపాల్: సీనియర్ ఐఏఎస్ అధికారి ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ పై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఆ కలెక్టర్ ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అజయ్ సింగ్ గంగ్వార్ మధ్యప్రదేశ్ లోని బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారం రోజుల కిందట మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక అంతే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారం రోజుల తర్వాత కలెక్టర్ ఆ పోస్ట్ డిలీట్ చేశారు.
రాజకీయ అంశాలపై అధికారులు కామెంట్లు చేయరాదన్న నియమాన్ని ఆయన ఉల్లంఘించారని, ప్రభుత్వాన్ని వ్యతిరికించేలా పోస్ట్ చేశాడంతో ఇది తీవ్ర చర్యగా భావించి ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వాన్ని, వ్యవస్థను టార్గెట్ చేస్తూ అజయ్ గంగ్వార్ పోస్ట్ ఉందని బీజేపీ నేత వివ్ఆస్ సారంగ్ తెలిపారు. ఇస్రో, ఐఐటీ, బార్క్, ఐఐఎస్బీ, ఐఐఎం, బీహెచ్యిఎల్, థర్మల్ ప్రాజెక్టులు, డ్యాములు ఎన్నో నిర్మించారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. నెహ్రూ సెక్యూలర్ తత్వాన్ని కూడా కలెక్టర్ అజయ్ సింగ్ ప్రస్తావించారు. ఈ పోస్ట్ విషయం తెలిసి అధికారులు విచారణ చేసి చివరకి కలెక్టర్ అజయ్ ఈ పోస్ట్ చేశారని తెలుసుకుని ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం బీజేపీపై మండిపడుతోంది. దేశంలో అసహనం ఉందనడానికి ఇది నిదర్శనమని, స్వాతంత్ర్య సమరయోధుడిని పొగడటం కూడా తప్పేనా అని ప్రశ్నించింది. నెహ్రూను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేస్తే కలెక్టర్ అజయ్ సింగ్ గంగ్వార్ ను బదిలీ చేశారంటేనే సామాన్య ప్రజల్లో ఇంకెన్ని భయాలున్నాయోనని కాంగ్రెస్ నేత అఫ్జల్ వ్యాఖ్యానించారు.