న్యూఢిల్లీ/చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతోపాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లపై ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పంజాబ్, హరియాణా శంభు సరిహద్దులో పోలీసులపై నిరసనకారుల రాళ్ల దాడులు, బారికేడ్ల విధ్వంసం, రైతన్నలపై బాష్పవాయువు ప్రయోగం వంటి ఘటనలు చోటుచేసుకున్నారు.
నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువుతోపాటు జల ఫిరంగులు ప్రయోగించారు. దాదాపు 100 మంది రైతులు గాయపడ్డారని రైతు సంఘాల నాయకులు చెప్పారు. శంభు బోర్డర్ వద్ద రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. మరోవైపు ఢిల్లీ శివార్లలోని సింఘు, చిల్లా, తిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలన్న రైతు సంఘాల ప్రణాళిక అమలు కాలేదు. ‘చలో ఢిల్లీ’ని మంగళవారం రాత్రికి నిలిపివేస్తున్నామని, బుధవారం ఉదయం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఎలాగైనా ఢిల్లీకి చేరుకొని, తమ గళం వినిపించడం ఖాయమన్నారు.
శంభు సరిహద్దులో యుద్ధ వాతావరణం
శంభు సరిహద్దు వద్ద ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైతులను ముందుకు వెళ్లనివ్వలేదు. చలో ఢిల్లీకి అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వంతెనపై బారికేడ్లను నదిలోకి తోసేశారు. సిమెంట్ బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు ప్రయతి్నంచారు. పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో పోలీసులు జల ఫిరంగులు, డ్రోన్లతో బాష్పవాయు గోళాలు ప్రయోగించి రైతులను చెదరగొట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
చర్చలు అసంపూర్ణం
రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం రాత్రి జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ర్యాలీని విరమించాలని మంత్రులు కోరగా నేతలు అంగీకరించలేదు. డిమాండ్లు నెరవేరే దాకా ఉద్యమం కొనసాగిస్తామని తే ల్చిచెప్పారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని మంత్రులు చెప్పారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి కమిటీ వేస్తామని ప్రతిపాదించగా నేతలు ఒప్పుకోలేదు. 2020–21 ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసుల ఉపసంహరణకు, మరణించిన వారి కటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు అప్పట్లోనే కేంద్రం ముందుకొచ్చింది. అవిప్పటికీ నెరవేరలేదని నేతలు ఆక్షేపించారు. పంటలు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని వారు మరోసారి తేల్చిచెప్పారు.
తక్షణం చర్చలు ప్రారంభించాలి
రైతులతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని, డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ చెప్పారు. ఉద్యమంపై కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదకరంగా మారవచ్చన్నారు. ఈ నెల 16న బంద్ పిలుపు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందన్నారు. తామెప్పుడూ రైతుల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. ‘‘డిమాండ్లు నెరవేరాలంటే రైతన్నలు ప్రతిసారీ ఉద్యమబాట పట్టాల్సిందేనా? ఢిల్లీకి వెళ్లాల్సిందేనా? ప్రభుత్వానికి బాధ్యత లేదా?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment