
చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ ప్రకటించి వారం కూడా గడవక ముందే పోలీసులు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృత్యువాతపడగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. చర్చలకు సిద్ధమని తెలిపినా బలగాలు కూంబింగ్‌కు వస్తుండడంతోనే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో గల బొదిలి, కాడిమెట్ట అటవీ ప్రాంతాల్లో రెండు జిల్లాలకు చెందిన 90 మంది డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు) పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
మంగళవారం మధ్యాహ్నం 3.10 గంటలకు ఆపరేషన్ ముగించుకొని 27 మంది పోలీసులు బస్సులో నారాయణ్‌పూర్ బయలుదేరారు. ఆ బస్సు సాయంత్రం 4.14 గంటలకు కదేనార్–కన్హర్‌గావ్ మార్గంలోని వంతెన సమీపంలోకి రాగానే మావోయిస్టులు రిమోట్ సాయంతో మందుపాతరను పేల్చి వేశారు. దీంతో బస్సు 20 అడుగుల మేర ఎగిరి వాగులో పడింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని నారాయణ్‌పూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి ఆరుగురిని ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తి వెల్లడించారు. మృతుల్లో కానిస్టేబుళ్లు సర్వెంట్ సలాం, సాహిత్, పవన్ మండవి, అసిస్టెంట్ కానిస్టేబుల్ విజయ్ పటేల్ లెవీ, డ్రైవర్ కానిస్టేబుల్ కరుణ్‌డెహారీ ఉన్నారు. మావోయిస్టుల కోసం సంఘటనా ప్రాంతానికి పోలీసు బలగాలను తరలించి కూం బింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment