భారీ వర్షాలకు తోడు నేపాల్ నుంచి వస్తున్న వరదనీరు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని బహ్రైచ్, శ్రావస్తి, గోండా, బలరాంపూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, బారాబంకి, సీతాపూర్ పరిధిలోని దాదాపు 250 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అలాగే లఖింపూర్ ఖేరీలోని 150 గ్రామాలు, షాజహాన్‌పూర్‌లోని 30, బదౌన్‌లోని 70, బరేలీలోని 70, పిలిభిత్‌లోని 222 గ్రామాలకు చెందిన ప్రజలు వరద నీటిలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరదల కారణంగా పూర్వాంచల్‌లోని బల్లియాలో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. వరుసగా రెండవ రోజు ఢిల్లీ-లక్నో హైవేపై గర్రా నది వరద నీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మొరాదాబాద్- లక్నో మధ్య 22 రైళ్లను నెమ్మదిగా నడుపుతున్నారు. షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి వరద నీరు చేరడంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
షాజహాన్‌పూర్ నగర శివార్లలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీతో సహా ఇతర లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం 225 మందిని రక్షించింది. ఎస్‌ఎస్ కళాశాల లైబ్రరీలోని వందల పుస్తకాలు నీట మునిగాయి. ఖేరీ, షాజహాన్‌పూర్, బరేలీకి చెందిన ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం 11 గంటలకు షాజహాన్‌పూర్ హైవేపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment