వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం.. అంతులేని అవినీతి, కుమ్మక్కు రాజకీయాల ఫలితంగా నిర్మించిన ఏడాదికే ఓ ఆనకట్టకు అవినీతి కంతలు పడ్డాయి. దీనికితోడు భారీ వర్షాలకు నీటి ఉద్ధృతి పెరగడంతో డ్యాం కూలిపోయే పరిస్థితి నెలకొంది. చేసేది లేక అధికారులు ఆనకట్టనే పేల్చివేశారు. అలా.. రూ.25 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది.
సాక్షి, చెన్నై(తమిళనాడు): భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్ట ఏడాదిలోపే బలహీన పడిపోయింది. పొంచి ఉన్న ముంపుముప్పు నుంచి గ్రామాలను కాపాడేందుకు దక్షిణ పెన్నానదిపై రూ.25.35 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ఆది, సోమవారాల్లో బాంబులతో అధికారులే పేల్చి.. కూల్చేవేశారు. వివరాలు.. విళుపురం జిల్లా దళవానూరు గ్రామం, కడలూరు జిల్లా ఎనదిరిమంగళూరు గ్రామాలకు మధ్య ప్రవహించే దక్షిణ పెన్నానదిపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం రూ.25.35 కోట్లతో ఆనకట్ట నిర్మించింది.
వ్యవసాయ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ఆనకట్టను గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. అయితే ప్రారంభించిన నాలుగు నెలలకే.. అంటే ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆనకట్ట క్రస్ట్‌గేట్లకు దన్నుగా ఇరువైపులా అమర్చిన గోడ పాక్షికంగా తెగిపోయింది. ఫలితంగా నీరు బయటకు ప్రవహించడం ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో బాధ్యులుగా భావిస్తూ ప్రజాపనులశాఖలోని ఆరుగురిని అధికారులు సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ మార్పుతో..
ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు చోటు చేసుకోగా రూ.15 కోట్లతో ఆనకట్టను మరమ్మతు చేయాలని ప్రజాపనులశాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఈలోగా భారీ వర్షాలు, వరద ప్రవాహం మొదలవడంతో మరమ్మతు పనులను ప్రారంభించలేక పోయారు. ఇదిలా ఉండగా, విళుపురం జిల్లాలో గత కొన్నిరోజులు కుండపోత వర్షాల వల్ల దక్షిణ పెన్నానదిలో వరద ప్రవాహం తీవ్రస్థాయికి చేరుకుంది.
దీంతో ఆనకట్ట పూర్తిగా నిండిపోయి వరదనీరు రెండువైపుల ఒడ్డును తాకడం మొదలైంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరిగింది. ఆనకట్టలోని మూడు క్రస్ట్ గేట్లు బలహీన దశకు చేరుకుని ఏ క్షణమైన బద్దలయ్యే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆనకట్టలోకి నీటి ప్రవాహాన్ని ఇసుకబస్తాలు వేసి నిలువరించేందుకు ఈనెల 10వ తేదీన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇన్‌ఫ్లో, ప్రవాహ ఒత్తిడిని తట్టుకోలేక ఆనకట్ట ఎడమవైపు తెగిపోగా ఉధృతంగా ప్రవహించిన నీటిలో స్థానికంగా సాగు చేసిన చెరకు పంట కొట్టుకుపోయింది. పైగా 11వ తేదీన అనకట్ట ప్రహరీగోడ బీటలు వారింది. దీంతో విళుపురం జిల్లా కలెక్టర్ మోహన్, ఎస్పీ శ్రీనాథ ఇతర ఉన్నతాధికారులు ఆదివారం ఉదయం ఆనకట్టను పరిశీలించారు.
ఈ సమయంలో సాతనూరు ఆనకట్ట నుంచి సెకనుకు 3,500 ఘనపుటడుగుల నీటిని దక్షిణ పెన్నానదిలోకి విడుదల చేసినట్లు సమాచారం అందింది. ఈ ప్రవాహం వల్ల పెన్నానది ఒడ్డు మరింతగా దెబ్బతిని పరిసర గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తే పెనుముప్పు తప్పదని అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ కారణంగా దెబ్బతిన్న మూడు క్రస్ట్ గేట్లను, దానికి సమీపంలోని ఆనకట్ట ప్రాంతాన్ని 50 అడుగుల మేర బాంబులతో పేల్చి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
మొదటిసారి తూచ్..
మూడు క్రస్ట్ గేట్లను, తీరంలోని కాంక్రీట్ గోడను వంద జిలెటిన్ స్టిక్స్, వంద తూటాలను 20 చోట్ల అమర్చి ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పేల్చేశారు. పేలుళ్ల ధాటికి ఆనకట్ట శిథిలాలు వంద మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. అయినా ఆశించిన స్థాయిలో ఆనకట్టను తొలగించలేక పోగా, అక్కడక్కడా పగుళ్లు చోటుచేసుకుని మరింత ప్రమాదకరంగా తయారైంది.
దక్షిణ పెన్నానదిలో ప్రవాహ ఉధృతి పెరిగినట్లయితే ఆనకట్ట పూర్తిగా కొట్టుకుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడింది. దీంతో సోమవారం మరోసారి బాంబులు పెట్టి పూర్తిస్థాయిలో పేల్చివేసినట్లు ప్రజాపనులశాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment