Happy Friendship Day 2021... స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి. దానికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయసు, స్థాయి, కులాలతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా ప్రతి మనిషి జీవితంలో స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా, ఎంత బిజీగా ఉన్నా ఆత్మీయ స్నేహితులతో కనీసం వారంలో ఒకటి, రెండు సార్లు కలవటం, మాట్లాడంగాని చేయకపోతే ఏదో కోల్పొయిన భావన కలుగుతుంది. అదే మరీ స్నేహానికి ఉన్న అద్భుతమైన శక్తి. ప్రతీ రోజు తమ కంపనీ షేర్ల విలువ, సంస్థల విస్తరణ, వ్యాపార లాభ నష్టాలు వంటి విషయాల్లో తలమునకలయ్యే దిగ్గజ వ్యాపారాలు కూడా తమ స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆ సమయంలో స్థాయి, భేదాలు మరచి స్నేహబంధ జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అలాంటి వారిలో ముందువరసలో ఉంటారు..
ముఖేశ్ అంబానీ, ఆనంద్ జైన్..ముఖేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని వ్యాపార దిగ్గజం. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ఆనంద్ జైన్ అయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇద్దరూ ముంబైలోని హిల్‌గ్రాంజ్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ముఖేశ్ కొంచెం బిడియంగా ఉంటాడు. అంతర్ముఖుడు. ఆనంద్ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలడు. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా ముఖేశ్ మనసులో ఆనంద్‌ది చెరిగిపోని స్థానం. మొదట్లో కలిసి పనిచేసినా, ఇప్పుడు ఎవరి వ్యాపారాల్లో వారు తలమునకలవుతున్నా వారంలో రెండు, మూడుసార్లయినా కలవటం, సరదాగా గడపడం వారిద్దరికీ అలవాటు.
కిరణ్ మజుందార్ షా... నీలిమా రౌషెన్
బయోకాన్ కంపెనీ అధినేత కిరణ్ మజుందార్ షా.. నీలిమా రౌషెన్.. ఇద్దరిదీ దాదాపుగా ఒకే నేపథ్యం... వారు పనిచేసే రంగాల్లో ఇద్దరిదీ ఒంటరి పోరాటం. ఒకరికొకరు పరిచయమయ్యారు. సొంత అక్కా చెల్లెళ్లలా కలసిపోయారు. అంతా బాగుందనుకున్న తరుణంలో క్యాన్సర్ బారిన పడ్డారు నీలిమ. ఆమెకు అన్ని విధాలా ఆసరాగా నిలిచారు కిరణ్... అయితే అనుకోకుండా కొన్ని రోజులకు కిరణ్ భర్తకు కూడా క్యాన్సర్ అని తేలింది. అయితే కిరణ్ భర్త వ్యాధినుంచి కోలుకున్నారు. ఇంకా కోలుకోని స్నేహితురాలు నీలిమను విదేశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించింది. అయినా స్నేహితురాలు దక్కలేదు. ఆ వేదనతోనే కిరణ్ కాన్సర్ పై పోరాటానికి వందల కోట్లు విరాళంగా ఇచ్చారు.
రతన్ టాటా– శంతను నాయుడు
రతన్‌టాటా.. మనసున్న వ్యాపారవేత్త. ఎనభయ్యో పడిలోనూ ఉరకలేసే ఉత్సాహం, సంస్థతో పాటు సమాజానికీ ఏదో చెయ్యాలన్న ఆరాటం. ఆ స్వభావమే తన కన్నా వయసులో ఎంతో చిన్నవాడైనప్పటికీ శంతను నాయుడితో స్నేహం చేసేందుకు పురిగొల్పింది. వయసులో తేడా ఉన్నా శంతనుదీ తనలాంటి స్వభావమే కావడంతో ఆ స్నేహబంధం మరింత బలపడింది. పుణెకు చెందిన శంతను నాయుడు– టాటా సంస్థలో ఉద్యోగిగా పనిచేసేవాడు. అతనికి శునకాలంటే వల్లమాలిన ప్రేమ. వాటి కోసం ఏకంగా ఒక స్వచ్ఛంద సంస్థనే పెట్టాడు. ఈ విషయం రతన్‌టాటా దృష్టికి వచ్చింది. ఆయనకూ జాగిలాలంటే ఇష్టం. శంతనుని ముంబైకి పిలిపించుకుని స్వయంగా కలిసి అభినందించారు. శంతను చేసే సంక్షేమ కార్యకలాపాల గురించి ఇద్దరిమధ్యా ఈ–మెయిల్స్ నడిచేవి. వారిద్దరి స్వభావాలూ, సేవాభావనలు ఒకేలా ఉండడంతో క్రమంగా ఇద్దరూ స్నేహితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment