![Goa Express Leaves 45 Passengers Behind Arriving 90 Minutes Early - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/28/Goa-Expres.jpg.webp?itok=2I2RWFKP)
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్‌మాడ్ స్టేషన్‌లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స‍్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు.
వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్‌మాడ్‌కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్‌లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్‌ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్‌మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు.
మన్‌మాడ్ స్టేషన్‌లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్‌లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్‌లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment