
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్‌ఎఫ్‌ను కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కొత్త, పాత పార్లమెంట్ భవనాల భద్రత సీఐఎస్‌ఎఫ్ పరిధిలోకి వస్తుంది.
సీఐఎస్‌ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీసు దళంలో భాగంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలకు కాపలాగా ఉంటుంది. అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్‌స్టాలేషన్‌లను కూడా కాపాడుతోంది. పార్లమెంటు భవన సముదాయాన్ని సర్వే చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. తద్వారా సీఐఎస్ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగాన్ని సమగ్ర నమూనాలో మోహరించడం సాధ్యమవుతుందని వెల్లడించారు.
డిసెంబర్ 13న పార్లమెంట్‌లో అలజడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నలుగురు దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని పట్టబట్టాయి. ఈ క్రమంలో దాదాపు 150 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయ్యారు.
ఇదీ చదవండి: Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్