తాము హత్య చేయలేదని మొత్తుకున్నా.. ఇద్దరు అమాయకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పైగా ఐపీసీలోని సెక్షన్‌లన్నీ ఆపాదించి గట్టి కేసు నమోదు చేశారు. కానీ, ఆ వ్యక్తి బతికే ఉన్నాడని, వాళ్లే నేరం చేయలేదని ట్విస్ట్ వెంటనే వెలుగు చూసింది. అది తెలిసీ.. పోలీసులు గప్‌చుప్‌గా ఉండిపోయారు. వాళ్లిద్దరికీ చేయని నేరానికి.. నరకం చూపించారు. ఆరేళ్లు ఆ ఇద్దరూ నేరస్థుల హోదాలో మానసిక క్షోభ అనుభవించారు. కానీ, చివరకు న్యాయమే గెలిచింది.
గుజరాత్‌లోని నవ్‌సారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2016, జులై 6వ తేదీన నాగులాల్ అనే వ్యక్తిని హత్య చేశారన్న ఆరోపణలపై మదన్, సురేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించి నాగులాల్ మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్న పోలీసులు.. శవ పరీక్షను హడావిడిగా కానిచ్చేశారు. బంధువులు సైతం కొద్దిపాటి పోలికలు ఉండడంతో అది నాగులాల్ మృతదేహామే అనుకుని మధ్యప్రదేశ్‌లోని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు.
ఆపై కొద్దిగంటలకే నాగులాల్ తన సోదరుడికి ఫోన్‌చేసి బంధువుల ఇంట్లో ఉన్నానని చెప్పాడు. దీంతో అతను గుజరాత్ పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాదు బాగా ఆకలేసి మదన్ ఇంట్లోకి దూరానని, ఆ సమయంలో మదన్ భార్య నిద్రలేవడంతో అక్కడి నుంచి పారిపోయి నవ్‌సారీ బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని నాగులాల్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కూడా. అప్పుడుగానీ అర్థం కాలేదు పోలీసులకు తామోక అనామక శవాన్ని నాగులాల్ మృతదేహాంగా పొరపడ్డామని.
కానీ, పోలీసులు మాత్రం అదేం పట్టించుకోకుండా.. ఆ ఇద్దరి పేర్లతో ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. పైగా ఓ నైలాన్ తాడుతో ‘బతికే ఉన్న’ నాగులాల్‌ను ఉరేసి చంపారని నేరం అంటగట్టారు. మూడు నెలలపాటు జైల్లో గడిపిన ఇద్దరూ.. బెయిల్ మీద విడుదలయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో నిందితులుగా కోర్టుకు హాజరవుతూనే వస్తున్నారు. ఈలోపు 19 మంది సాక్ష్యులు, 35 డాక్యుమెంట్లతో సాక్ష్యాధారాల పేరిట ఓ నివేదికను(అందులో నాగూలాల్ హత్యకు గురయ్యాడనే ఉంది) సైతం సమర్పించారు.
ఈ కేసులో వాదనలు నడుస్తుండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం వాదనలు వినిపించారు. అదే టైంలో పోలీసులు నాగులాల్ ఆచూకీని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే డిఫెన్స్‌లాయర్ మాత్రం పక్కా ఆధారాల్ని సేకరించారు. నాగూలాల్ బతికే ఉన్నాడని అతను ఉంటున్న గ్రామ పంచాయితీ అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్, అతని సోదరుడితో సాక్ష్యం చెప్పించి మరీ బాధితులకు న్యాయం కలిగేలా చూశారు.
దీంతో కోర్టు.. సురేష్, మదన్‌లకు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. ఆ టైంలో దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారి ప్రదీప్‌సిన్హ్ గోహిల్ మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులకు వత్తాసు పలుకుతూ వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లను సైతం మందలించింది కోర్టు. అంతేకాదు.. బాధితులకు ఆరేళ్లుగా కలిగిన మానసిక క్షోభ, సంఘంలో దెబ్బతిన్న గౌరవానికి గానూ క్షమాపణలు చెప్పాలని, ఇంతకాలం కలిగిన ఆర్థిక నష్టాన్ని భరించాలంటూ పేర్కొంటూ మదన్, సరేష్‌లకు చోరో యాభై వేల నష్టపరిహారం ప్రదీప్ చెల్లించాలంటూ మార్చి 30వ తేదీన తుదితీర్పు వెల్లడించారు అదనపు న్యాయమూర్తి సారంగ వ్యాస్.
Comments
Please login to add a commentAdd a comment