సాక్షి, చెన్నై: రాష్ట్రాన్ని మరో ఐదురోజులపాటూ భారీవర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో సహాయక చర్యలు, కంట్రోలు రూం ఏర్పాటుతో ప్రభుత్వ యంత్రాగం సన్నద్ధమైంది. ఏటా అక్టోబరు రెండోవారంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమై డిశంబర్ వరకు కొనసాగుతాయి. గత ఏడాది అక్టోబరు 28వ తేదీన ఆలస్యంగా ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల ఆరుశాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది అక్టోబరు 25వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో దక్షిణ తమిళనాడు, డెల్టాజిల్లాల్లో మరో ఐదురోజులపాటూ ఉరుములు, పిడుగుపాటుతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది.
చెన్నైలో శనివారం కుండపోతగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి మోకాలి లోతు వరదనీరు ప్రవేశించింది. చెన్నై శివార్లు మీంజూరులో వంద ఎకరాల పంట వర్షార్పణమైంది. వరదనీరు వరి పంటపొలాల్లో ప్రవహించడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. పంటపొలాల్లో నిల్వ ఉన్న నీటిని.. తరలించేందుకు అధికారులు రోడ్లను తెగ్గొట్టంతో ప్రజలు మరింత అవస్థలకు గురయ్యారు. చెంబరబాక్కం జలాశయ మొత్తం నీటిమట్టం 24 అడుగులు కాగా, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నీటిమట్టం 21.15 అడుగులకు చేరుకుంది. ఈ నీటిమట్టం 22 అడుగులకు చేరినపక్షంలో ఉపరితల నీటి విడుదలకై క్రస్ట్ గేట్లు ఎత్తివేయక తప్పదని అధికారులు చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంబరబాక్కం నీటి పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.
చదవండి: (చికెన్ ముక్క గొంతులో చిక్కుకుని..)
అల్పపీడనద్రోణి
బంగాళాఖాతంలో ఈనెల 9వ తేదీన ఏర్పడే అల్పపీడన ద్రోణి 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు దిశగా పయనిస్తుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకులు బాలచంద్రన్ తెలిపారు. దీని ప్రభావం వల్ల 10 – 12 తేదీవరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతం నడిసంద్రం పశ్చిమాన, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితలద్రోణి కారణంగా తమిళనాడులో మరో ఐదురోజులపాటూ భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.
కంట్రోల్ రూంల ఏర్పాటు
రుతుపవనాల వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులలో రక్షణ చర్యలు చేపట్టేందుకు 8,462 అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛదం సేవకులు సిద్ధంగా ఉన్నారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం కంట్రోలు రూం ఏర్పాటు చేసి 044–24331074/ 24343662/1070/ 9445869843 ఫోన్ నెంబర్లను ప్రకటించింది. అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడే ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం అధికారులతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment