భారీ వర్షాలకు బెంగళూరు జలమయం.. వాగుల్లా మారిన రోడ్లు | Heavy Rains Bengaluru Many Areas Submerged | Sakshi
Sakshi News home page

బెంగళూరులో వరుణుడి బీభత్సం.. వరదలో కొట్టుకుపోయిన బైక్‌లు

Published Mon, Sep 5 2022 11:46 AM | Last Updated on Mon, Sep 5 2022 1:29 PM

Heavy Rains Bengaluru Many Areas Submerged - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వీధులు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపుర రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఅవుట్ ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మారథహళ్లిలోని స్పైక్ గార్డెన్‌లో  ద్విచక్ర వాహనాలు వరదనీటిలో పడవల్లా కొట్టుకుపోయాయి. మారథహళ్లి సిల్క్ బోర్డు జంక్షన్‌లో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని సహాయ బృందాలు రక్షించాయి.

నీటమునిగిన ప్రాంతాల్లో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సహాయక బృందాలను రంగంలోకి దించి జలదిగ్భంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరదలకు సంబంధించిన ఫోటోలను నగరవాసులు సామాజిక వేదికగా షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు.  బెంగళూరు చరిత్రోలనే తొలిసారి ప్రీమియం సొసైటీల్లో కూడా వరద నీరు చేరిందని పేర్కొన్నారు. సాయం అందించాలని సీఎం బసవరాజ్ బొమ్మైని విజ్ఞప్తి చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరికొందరు నెటిజన్లు మాత్రం  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 10 నిమిషాలు వర్షం పడితే బెంగళూరులో పరిస్థితి ఇలా ఉంటుందా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక పన్నులు కడుతున్న తమకు సరైన మౌళిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేరా? అని ప్రశ్నించారు.

భారీ వర్షాల ధాటికి ఐటీ పార్కులను అనుసంధానించే ఔటర్ రింగ్‌ రోడ్డుపై వరద నీటితో  భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్ 9 వరకు బెంగళారులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చికమగళూరు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది.
చదవండి: భళా.. బాలకా.. 15 ఏళ్లకే చెన్నై నుంచి లేహ్‌కు సైకిల్‌ యాత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement