న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఎంతోకాలంగా తెరపైకి తెస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరో కీలక ముందడుగు పడింది. లోక్ సభతో పాటు, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల దాకా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై లోతుగా అధ్యయనం జరిపి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యం వహిస్తారు. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్ సహా విపక్షాలకు కూడా కమిటీలో చోటు దక్కడం విశేషం. కేంద్రం తరఫున హోం మంత్రి అమిత్ షా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ నుంచి లోక్ సభలో ఆ పక్ష నేత అదీర్ రంజన్ చౌధరి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ తక్షణం రంగంలో దిగి పని చేయడం ప్రారంభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేస్తుంది. కాగా ఈ కమిటీలో చేరేందుకు అ«దీర్ రంజన్‌తిరస్కరించడం గమనార్హం.
కమిటీ ఏమేం చేస్తుందంటే...
► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే ఏం చేయాలో సిఫార్సులు చేస్తుంది.
► దీనికి రాజ్యాంగంలో, ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితర చట్టాలు, నిబంధనలకు చేయాల్సిన సవరణలు, మార్పులను సూచిస్తుంది.
► రాజ్యాంగంలోని సంబంధిత అధికరణలకు చేయాల్సిన సవరణలను రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సిన ఆవశ్యకత ఉందో లేదో పరిశీలిస్తుంది.
► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే అందుకు అడ్డంకిగా మారగల హంగ్ సభ, అవిశ్వాస తీర్మానాలు, పార్టీ ఫిరాయింపులు తదితర సమస్యలు, వాటిని అధిగమించాల్సిన విధానాలను పరిశీలిస్తుంది.
► తమ పరిశీలన, అధ్యయనానికి తోడ్పడేలా, తుది సిఫార్సుల రూపకల్పనలో ఉపకరించేలా ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా, విజ్ఞాపనలు చేసినా కమిటీ స్వీకరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment