కంచర్ల యాదగిరిరెడ్డి : అదండీ విషయం...ఈ రోజుల్లో మీకు ఏం కావాలన్నా క్షణంలో సమాచారంతో పాటు మీకు కావాల్సింది ఇచ్చే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు పుట్టుకొచ్చేశాయి. ఏడాది క్రితం చాట్ జీపీటీ విడుదలతో మొదలైన కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు ఇప్పుడు ఓ ప్రభంజనంలా మారిపోయాయి. జనరేటివ్ ఏఐ సాఫ్ట్‌వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, అమ్మకాలు ఎక్కువవుతాయని, సాధారణ వినియోగదారులకూ లాభమని అంటున్నారు.
బాగానే ఉంది కానీ, ఇది ఎంతవరకూ నిజం? వాటికంటూ విలువ కట్టగలమా? అవును అంటోంది .అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే! భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి ఏటా కనీసం 2.6 లక్షల కోట్ల నుంచి 4.4 లక్షల కోట్ల డాలర్ల వరకూ లబ్ధి చేకూరనుందని తెలిపింది.
చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా..
జనరేటివ్ ఏఐ మొదలై ఏడాది కూడా కాలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రభావం ఎలా చూపగలదన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. మెకిన్సే అంచనా ప్రకారం ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటినుంచే వేగం పుంజుకుంటుందని 2030– 2060 మధ్యకాలంలో చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా అయిపోతాయని చెబుతోంది. ఇప్పుడు చేస్తున్న పనుల్లో సగం 2030 నాటికల్లా ఆటోమేటిక్ అవుతాయని తెలిపింది. మునుపటి అంచనాల కంటే ఇది పదేళ్లు తక్కువ కావడం గమనార్హం.
కార్మికుల ఉత్పాదకత విషయానికి వస్తే 2040 నాటికి ఇది ఏటా 0.1 –0.6 శాతం పెరుగుతుందని కాకపోతే చేసే పనులు మారిపోతాయి కాబట్టి ఆ మార్పునకు అనుగుణంగా కారి్మకులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు సాయం అందించాల్సి ఉంటుందని మెకిన్సే తెలిపింది. ఒకవేళ అన్ని రంగాల్లోనూ జనరేటివ్ ఏఐ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మాత్రం పనుల ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత 0.2 –3.3 శాతం వరకు పెరుగుతుంది.
బ్యాంకింగ్, జీవశాస్త్రంలో ఎక్కువ ప్రభావం!
లక్షల కోట్ల మాట కాసేపు పక్కనపెడితే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు అన్ని రంగాల్లోనూ చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే బ్యాంకింగ్, జీవశాస్త్రంలో కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుందని మెకిన్సే అంచనా వేసింది. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఈ సాఫ్ట్‌వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరిగి ఏటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ లాభం చేకూరుతుందని తేలింది. ఇక రిటైల్, కన్సూ్యమర్ ప్యాకేజ్డ్ గూడ్స్‌లలో జనరేటివ్ ఏఐని పూర్తిస్థాయిలో వాడితే కలిగే లాభం రూ.60 వేల కోట్లకు పైమాటే.
ఇక ఈ కృత్రిమ మేధ వాడకం కేవలం లాభాలకు మాత్రమే పరిమితం కాదు. చేసే పని తీరుతెన్నులు కూడా మారిపోతాయి. ఒక వ్యక్తి చాలా సాధారణంగా చేసే పనులన్నింటినీ ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ వారి ఉత్పాదకతను పెంచుతుంది. మెకిన్సే లెక్కల ప్రకారం మనుషులు చేసే వాటిల్లో 60 నుంచి 70 శాతం పనులను ఏఐలు ఆటోమేటిక్‌గా చేయగలవు. చాట్ జీపీటీ లాంటి వాటికి భాషను అర్థం చేసుకోగల సామర్థ్యం కూడా ఉండటం వల్ల బోధన వంటి పనులకు బాగా ఉపయోగపడుతుందని అంచనా.
ఈ రంగాల్లో లాభాలెక్కువ
జనరేటివ్ ఏఐతో అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా లాభాలూ పెరుగుతాయి. కానీ.. వినియోగదారుల వ్యవహారాలు, మార్కెటింగ్, సేల్స్ రంగాలతో పాటు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, జీవశా్రస్తాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మెకిన్సే జరిపిన సర్వే ప్రకారం ఐదు వేల మంది సేల్స్ సరీ్వస్ ఉద్యోగులున్న కంపెనీలో జనరేటివ్ ఏఐ వాడకంతో ఒక్కో వినియోగదారుడి సమస్యను పరిష్కరించేందుకు పట్టే సమయం దాదాపుగా 10 శాతం తగ్గింది. కంపెనీ మొత్తమ్మీద చూస్తే గంటకు 14 శాతం ఎక్కువగా వినియోగదారుల సమస్యలు పరిష్కారమయ్యాయి.
అలాగే ‘మీ మేనేజర్‌ను పిలవండి..’అన్న ఫిర్యాదులు 25 శాతం వరకూ తగ్గిపోయాయి. వినియోగదారుల డిమాండ్లు, పనిఒత్తిళ్ల కారణంగా ఉద్యోగాలు మానేయడం కూడా తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇక మార్కెటింగ్, సేల్స్ రంగాల విషయానికి వస్తే జనరేటివ్ ఏఐ వినియోగంతో ఖర్చులు సగానికి సగం తగ్గడం మాత్రమే కాకుండా అమ్మకాలు పది రెట్లు పెరుగుతాయి. మార్కెటింగ్‌కు అవసరమైన సమాచారాన్ని వేగంగా సృష్టించడం, ప్రాంతాలకు, ఒక్కో వినియోగదారుడికి తగి న విధంగా మార్చడం కూడా ఈ జనరేటివ్ ఏఐతో సాధ్యమవుతుందని, భాషల అంతరం తొలగిపోయి ఎవరికి కావల్సిన భాష లో సమాచారం ఈమెయిళ్ల రూపంలో ఠకీమని పంపవచ్చునని మెకిన్సే చెబుతోంది.
జనరేటివ్ ఏఐకి ఉన్న మరో సామర్థ్యం సాఫ్ట్‌వేర్ కోడ్ రాయగలగడం. దీనివల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేసే చిన్నచిన్న పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, క్వాలిటీ, బగ్స్ ను తొలగించడం వంటివి సులువైపోతాయి. చివరగా పరిశోధనలకు ఫార్మా వైద్యం వంటి రంగాలకు జనరేటివ్ ఏఐ ఎంతో ఉపయోగకరం. ఈ రంగానికి ఏటా రూ.25 వేల కోట్ల విలువను జోడించగల సామర్థ్యం దీనికి ఉంది.
అమెరికాలో పెరుగుతున్న చాట్ జీపీటీ వాడకం
అమెరికాలో చాట్ జీపీటీ వాడకం ఊపందుకుంటోంది. స్టాటిస్టా జరిపిన సర్వే ప్రకారం జనవరిలో సొంత అవసరాల కోసం ఈ జనరేటివ్ ఏఐని వాడామని 12 శాతం మంది చెప్పగా, ఇతరులు వాడటం చూశామని 38 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మహిళలు మాత్రం తాము చాట్ జీపీటీ గురించి అస్సలు వినలేదని చెప్పారు.
2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్
- నెక్స్ట్ మూవ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ మార్కెట్ విలువ దాదాపుగా రెండు లక్షల కోట్ల డాలర్లు.
- హాలీవుడ్‌లో రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తమ స్థానంలో ప్రొడక్షన్ కంపెనీలు జనరేటివ్ ఏఐలను వాడరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకు అవసరమైన స్క్రిప్ట్ లు రాయడం మొదలుకొని, మనుషులను పోలిన గొంతులను కూడా సృష్టించగలదీ జనరేటివ్ ఏఐ.
- స్నాప్‌చాట్ ఇప్పటికే యానిమేషన్ల కోసం జనరేటివ్ ఏఐని వాడటం మొదలుపెట్టగా.. ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా అదే బాట పట్టింది.
- ఓరియో బిస్కెట్లు తయారు చేసే సంస్థ సినీ నటుడు ఫర్హాన్ అక్తర్, జనరేటివ్ ఏఐల సాయంతో సరికొత్త వాణిజ్య ప్రకటనను సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment